దేవినేని ఉమా ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రెండు దశాబ్దాల నుంచి కృష్ణా జిల్లా టీడీపీలో చక్రం తిప్పుతున్న నేత. వరుసగా నాలుగుసార్లు గెలవడంతో జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఇక గత టీడీపీ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చంద్రబాబు కేబినెట్‌లో ముఖ్యపాత్ర పోషించారు. అయితే వరుసగా విజయాలు చూసిన ఈ నేతకు 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి ఎదురుకావడంతో, పరిస్థితులు తారుమారయ్యాయి.

 

ఈయన అంటే ప్రత్యర్ధ వైసీపీ నేతలకు ఎలా పడదో, సొంత టీడీపీలో కొందరు నేతలకు కూడా ఈయన అంటే పడదు. గత కొన్నేళ్లుగా జిల్లాపై పెత్తనం చేయడం వల్లే చాలామంది టీడీపీ నేతలకు ఉమా మీద అసంతృప్తి ఉంది. ఇక ఇప్పుడు ఈయన ఓటమి పాలవ్వడంతో జిల్లా నేతలు పెద్దగా లెక్క చేయడంలేదు. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లకు ఉమా అంటే పీకలవరకు ఉంది. ఒకానొక సమయంలో కేశినేని ఉమాపై పరోక్ష విమర్శలు చేశారు కూడా.

 

అటు వల్లభనేని వంశీ టీడీపీని వీడే ముందు ఉమా గురించి ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. అయితే ఈ విధంగా ఓడిపోయి, సొంత నేతల నుంచి విమర్శలు వచ్చిన ఉమా మాత్రం పార్టీ కోసం పనిచేయడంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు. నిత్యం తన నియోజకవర్గంలో ఏదో కార్యక్రమంతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అధినేత వైసీపీ ప్రభుత్వం మీద ఏదైనా పోరాటానికి పిలుపునిస్తే, చేయడానికి ముందుంటున్నారు.

 

ఇక వీలు కుదిరినప్పుడల్లా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయానికి ఎండగడుతున్నారు. ముఖ్యంగా అమరావతి ఉద్యమానికి గట్టి మద్ధతిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మిగతా నేతలు అమరావతి గురించి పెద్దగా పోరాటం చేయకపోయిన, ఉమా మాత్రం  ఉద్యమాన్ని వదలలేదు. ఏదొక సమయంలో అమరావతి టెంట్‌ల్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. ఇటు ప్రజా చైతన్య యాత్రలు తన నియోజకవర్గంలోనే కాకుండా, పక్క నియోజకవర్గాల్లోకి కూడా వెళ్ళి అక్కడ నేతలకు మద్ధతుగా తిరుగుతున్నారు. ఏదేమైనా కృష్ణాలో దేవినేని రాజకీయమే వేరులే.

మరింత సమాచారం తెలుసుకోండి: