కరోనా వైరస్‌ ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఈ శతాబ్ది మహమ్మారిగా రికార్డ్ సృష్టిస్తోంది. కేవలం రెండు నెలల్లోనే ఇది ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. వేలాది మందిని బలిగొంది.. ఇప్పటికైనా అలెర్ట్ కాకపోతే ఇది మున్ముందు మరింత భయంకరంగా మారనుంది.. ఈ నేపథ్యంలో మనమేం చేయాలి.. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసా..

 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు కోవిడ్ -19గా ఈ మధ్యే పేరు పెట్టారు.  చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచంలో 70కి పైగా దేశాలకు విస్తరించింది. సాధారణంగా కరోనా వైరస్.. జంతువుల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా గబ్బిలాల్లో, ఒంటెల్లో.. ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల.. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకింది.

 

కోవిడ్ -19 కూడా సార్స్‌ లాగే గబ్బిలాల్లో ముందుగా వచ్చింది. వాటి నుంచి పాంగలిన్ అనే జంతువుకు వ్యాపించింది. లాటిన్‌లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ వైరస్‌ను మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో ఉండటంతో దీనికా పేరు పెట్టారు. కరోనా వైరస్‌ మనుషుల్లో ఎంటరయ్యాక కొద్దిరోజుల వరకు పెద్ద ప్రభావమేమి కనిపించదు. అయితే ఒకటి నుంచి రెండు వారాలలోపు దీని ప్రభావం చూపించడం మొదలవుతుంది. ముఖ్యంగా  60 ఏళ్లు పైబడిన వాళ్లు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు, స్మోకింగ్ చేసేవాళ్లలో.. ఇది త్వరగా వ్యాప్తి చెందుతుంది.

 

కరోనా సోకిన వారికి జలుబు సాధారణ స్థాయిలో ఉండదు. ఊపిరాడని విధంగా తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు వారు వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలి. మొదటిసారి టెస్ట్‌ చేసినప్పుడు ఒక్కోసారి ఇది బయటపడకపోవచ్చు. ఓసారి నెగెటివ్ వచ్చినా.. మరోసారి పాజిటివ్ రావచ్చు. కరోనా సోకిన వారికి శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. దగ్గు, జలుబు, ముక్కుకారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది.. ఈ వైరస్ సోకిన వారిలో మొదట జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత పొడి దగ్గు కనిపిస్తుంది. మెల్లగా అది శ్వాసలో  ఇబ్బందులకు దారి తీస్తుంది. వ్యాధి ముదిరితే ఇన్ఫెక్షన్ న్యుమోనియాగా మారుతుంది. కిడ్నీలు ఫెయిల్‌ అవుతాయి.

 

కోవిడ్‌ వైరస్‌ సోకినవారికి మనం దగ్గరగా ఉన్నప్పుడు వారు తుమ్మినా, దగ్గినా మనకు వైరస్‌ సోకుతుంది. వ్యాధిగ్రస్తులు మాట్లాడినప్పుడు వారి నోటి నుంచి రాలే తుంపర్లు మన ముఖంపై పడినా వస్తుంది. వ్యాధి ఉన్నవారు వాడిన కంప్యూటర్లు లేదా మరే ఇతర వస్తువులను మనం ముట్టుకున్నా, వాడినా కరోనా మనకు కూడా సోకుతుంది.

 

ఇతర వైరస్‌లలాగా కోవిడ్‌ వైరస్‌ బాహ్య వాతావరణంలో వెంటనే చనిపోకుండా కొన్ని రోజులపాటు బతికి ఉంటుంది. వైరస్‌ ఉన్న వస్తువులను లేదా ఉపరితలాలను మనం ముట్టుకొని, ఆ చేతులతో నోరో, ముక్కో తుడుచుకున్నప్పుడూ మనకూ సోకుతుంది. మన చేతులకు వైరస్‌ సోకి ఉండవచ్చనే అనుమానం వేసినప్పుడు వెంటనే చేతులను సబ్బుతోకానీ, శానిటైజర్‌తో కానీ, బ్లీచింగ్‌ పౌడర్లతోని శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లినప్పుడు నాణ్యమైన మాస్కులు ధరించాలి. మనం బయటకు వెళ్లినప్పుడు, వెళ్లి వచ్చినప్పుడు శుభ్రంగా కడుక్కోకుండా చేతులతో నోటిని, ముక్కును తాకరాదు. ఏవీ తినరాదు..

 

బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ బాధితులు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారికి ఈ వ్యాధి ఈజీగా సోకుతోంది. చనిపోతున్నవారిలో ఎక్కువమంది ఇలాంటి వాళ్లే.! కాబట్టి ఈ వ్యాధులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కరోనా వైరస్‌కు సంబంధించి ఏదైనా సందేహాలు, సమాచారం కావాల్సి వస్తే 011-23978046 హెల్ప్‌ లైన్‌ నెంబర్‌కు కాల్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: