ఏ ప‌నీలేనోడు.. జుట్టు జుట్టు ముడేసిన‌ట్టు..గా ఉంది ఓ మాజీ ప్ర‌భుత్వ అధికారి, ప్ర‌స్తుతం బీజేపీలోఉన్న నాయ‌కుడికి! ఆయ‌నే ఐవైఆర్ కృష్ణారావు. ఈయ‌న‌కు ఇప్పుడు పెద్ద‌గా ప‌ని, పాటాలేన‌ట్టున్నాయి. అందుకే ప‌నికిమాలిన విమ‌ర్శ‌ల‌తో పొద్దు పుచ్చు తున్నార‌నే వాద‌న సోష‌ల్ మీడియాలో బ‌లంగా వినిపిస్తోంది. ఇంత‌కీ ఈయ‌న చేసిన ప‌నిని చెప్పుకొనే ముందు.. అస‌లు రాష్ట్రంలో ఏం జ‌రిగిందో చూద్దాం.. సామాజిక భద్రత పెన్షన్ల కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 58,44,642 పెన్షన్లలో మార్చి 1(ఆదివార‌మే అయిన‌ప్ప‌టికీ) మధ్యాహ్నం 2 గంటలకు 45.24 లక్షలు పంపిణీ  చేశారు.

 

 పెన్షన్ల పంపిణీపై రియల్‌ టైం డేటాను రూపొందించారు. వాలంటీర్లకు ఇచ్చిన సెల్‌ఫోన్‌లో లోడ్ చేసిన ప్రత్యేకమైన యాప్ ద్వారా వేలిముద్ర, ఐడీ రికార్డు ఉన్న లబ్ధిదారులకు అందించారు. ఫ‌లితంగా ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర‌, సుదూర ప్రాంతాల్లోని అనేక మంది దివ్యాంగు లకు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు, వృద్ధుల‌కు, ఇల్లుక‌దిలేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది ప‌డే రోగుల‌కు ఈ ప‌రిణామంతో మంచి ఉప శ‌మ‌నం ల‌భించింది. దీనిని ప్ర‌తిప‌క్షాలే ఆహ్వానించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎందుకంటే.. గ‌తంలో పెద్ద ఎత్తున క్యూల‌లో నిల బ‌డి.. వృద్ధులు సొమ్మ‌సిల్లిపోయిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి.

 

అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం వేస‌వి ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఇత‌రుల‌కు కూడా పింఛ‌న్ పంపిణీ కేంద్రాల‌కు వ‌చ్చి సొమ్ము తీసుకోవ‌డం క‌ష్టం. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇంటికే పంపించే ఏర్పాటు చేసింది. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌లో ప్ర‌ధాన భాగం ఇదే. ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌ల‌కు చేసే/ అందే ప్ర‌తి సేవా.. కూడా వారి ఇంటికే చేరాల‌నేది జ‌గ‌న్ సంక‌ల్పం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే, దీనికి కూడా ఐవైఆర్ వంటి మేధావులు కోడిగుడ్డుపై ఈక‌లు పీకారు. ఇంటివద్దే పెన్షన్‌ల పంపిణీపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సోష‌ల్ మీడియాలో స్పందించారు.

 

టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నిమిషాల్లో పెన్షన్ బ్యాంక్ అకౌంట్‌కు జమ చేసే విధానం ఉండగా గడప వద్దకు పెన్షన్ అవసరమా అని ఆయన ప్రశ్నించారు. తామే సొంతంగా పెన్షన్ ఇస్తున్నామన్న భావన కల్పించేందుకే తప్ప ఇంటివద్దకే పెన్షన్‌తో ప్రయోజనం శూన్యమని కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఆయ‌న సీఎస్‌గా అనుభ‌వం ఉండి కూడా ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలిసి ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ఆయ‌న స‌మ‌ర్ధించుకున్నా.. ఇంటింటికీ పంపిణీ అయిన ఫించ‌న్‌తో ఆనందం వెల్లివిరుస్తున్న ప్ర‌జ‌ల మోముల్లోని సంతోషం మాత్రం ఆయ‌న‌ను వెక్కిరిస్తోంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి: