9 నెలలకు ముందు బీసీలు తమపార్టీకి వెన్నెముక అని చెప్పిన జగన్, అధికారంలోకి రాగానే వారి వెన్ను విరిచేలా రిజర్వేషన్ల ప్రక్రియలో వారికి తీరని అన్యాయం చేశాడని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి దక్కాల్సిన స్థానాలను దక్కకుండా చేశాడని టీడీపీనేత, మాజీ విప్ కూన రవికుమార్ మండిపడ్డారు. ఏలూరులో బీసీ గర్జన నిర్వహించిన జగన్, ఆనాడు మాట్లాడుతూ, బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ అనిచెప్పి, అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో  వారికి అవకాశమే లేకుండా చేయడానికి సిద్ధమవడం బీసీలగొంతు కోయడం కాదా అని రవికుమార్ నిలదీశారు. 

 
బీసీ గర్జన సభలో బీసీలకు ఎమ్మెల్సీ పదవులిస్తాను, నామినేటెడ్ పదవులిస్తాను అని చెప్పిన జగన్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి దక్కాల్సిన పదవులనే ఊడపీకాడన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల్లో దక్కాల్సిన ప్రాతినిధ్యం దక్కకుండా చేయాలన్న దుర్భుద్ధితోనే, జగన్ సర్కారు కోర్టులో బలహీనమైన వాదనలు వినిపించిం దన్నారు. 1993లో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం చేసిన రాజ్యాంగస వరణల అనంతరం, 1994లో నాటి రాష్ట్రప్రభుత్వం బీసీలకు స్థానికసంస్థల ఎన్నికల్లో 34శాతానికి రిజర్వేషన్లు తగ్గకుండా చట్టం చేయడం జరిగిందన్నారు. ఆ చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 1995లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేసిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కిందన్నారు. 
 
 
ఆనాడు చంద్రబాబు అమలుచేసిన 34శాతంలో పదిశాతం తగ్గించి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలని జగన్ చూడటం సిగ్గుచేట్టన్నారు. 2001, 2004లో కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లే అమలయ్యాయని, ఎక్కడా కూడా ఒక్కశాతం కూడా తగ్గలేదన్నారు. అనంతరం 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ, బీసీల రిజర్వేషన్లు తగ్గకుండా చూడాలన్న సదుద్దేశంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగిందన్నారు. ఆనాటి ప్రభుత్వం కోరినవిధంగా సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లన్నీ 60.55శాతం అమలయ్యేలా ఎన్నికలకు వెళ్లాలని సూచించడం జరిగిందన్నారు. సుప్రీం ఆదేశాలప్రకారమే నాటి రాష్ట్రప్రభుత్వం పంచాయతీ, మండలపరిషత్, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఏవర్గానికి అన్యాయం జరగకుండా చూసిందని కూన తెలిపారు.  రెండుదశాబ్దాలపాటు బీసీలకు దక్కిన అత్యున్నతస్థానాన్ని తగ్గించేలా జగన్ సర్కారు కుటిలప్రయత్నాలు చేస్తోందని, ఆహక్కు జగన్ కు ఎవరిచ్చారని టీడీపీనేత నిలదీశారు. 
 
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయకుండా, అన్యాయం జరిగేది బీసీలకే కదా అన్న ఉదాసీనతతోనే జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తెలుగుదేశం బీసీలకు ఇచ్చిన 34శాతం రిజర్వేషన్లు తగ్గించాలన్న దుర్భుద్ధి జగన్ సర్కారులో ఉందని, అందులో భాగంగానే రెడ్ల సంఘం ప్రధానకార్యదర్శితో కోర్టులో పిటిషన్ వేయించిందన్నారు. బీసీలంటే ఏమీచేయలేనివారనే భావన జగన్ లో ఉన్నట్టుందని, అందుకే బీసీల గొంతు నొక్కడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే, పార్లమెంట్ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు, అంగ – ఆర్థిక బలాలు చూసిన జగన్, స్థానిక ఎన్నికల్లో కూడా అదే విధానం అమలుచేసి, తనజేబు నింపుకోవాలన్న దురాశతోనే బీసీల రిజర్వేషన్లకు కత్తెర పడేలా చేశాడని, రవికుమార్ దుయ్యబట్టారు.  
 
 
జగన్ కు కర్కశమైన మనస్తత్వం ఉండబట్టే, బీసీల రిజర్వేషన్లు తగ్గించడానికి తన సామాజికవర్గం వారితో, తన పార్టీవారితో కోర్టుల్లో కేసులేయించాడన్నా రు. రెడ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డితో, అనంతపురం జిల్లా రాఫ్తాడు మండల వైసీపీ కన్వీనర్ ఆంజనేయులుతో బీసీల రిజర్వేషన్లు తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి కేసులు వేయించాడన్నారు. ఆకేసులను వాదించడానికి మంచి న్యాయవాదులను నియమించకుండా, బీసీలకు అన్యాయం చేయడానికే సిద్ధపడ్డాడన్నారు. బీసీలంటే జగన్ కు ఎందుకంత చిన్నచూపో, ఎందుకంత కక్ష ఆయనే సమాధానం చెప్పాలన్నారు. బీసీ కార్పొరేషన్ నిధులను జగన్ అమ్మఒడి పథకానికి మళ్లించాడని, ఆయనకు ఆ అధికారం ఎవరిచ్చారో సమాధానం చెప్పాలన్నారు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి, బీసీలకు ఫెడరేషన్లు ఏర్పాటుచేస్తానని చెప్పి, చివరకు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకుండా చేశాడన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తుంటే, బీసీలమని చెప్పుకునే బొత్స, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు నోరుమెదపడంలేదని కూన నిలదీశారు. 1994లో నాటి చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే, దాదాపు పాతికేళ్ల తర్వాత జగన్ ఆ నిష్పత్తి ప్రకారం కూడా వారికి రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నాడన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: