బడ బడ వ్యక్తులంతా ఇప్పుడు తమ స్టేటస్ ను ప్రపంచానికి చాటిచెప్పేందుకు పెళ్లిళ్లను  వేదికగా చేసుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా, కనివిని ఎరుగని రీతిలో తమ కుటుంబంలోని వేడుకలు జరగాలని, వాటి గురించి అంతా మాట్లాడుకోవాలని వీరు అభిప్రాయ పడుతున్నారు. అందుకే కోట్ల కొద్దీ డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టేందుకు సైతం వీరు వెనుకాడటం లేదు. ఇక వేలకోట్ల ఆస్తి పాస్తులు ఉంటే ఆ ఇళ్లలో పెళ్లి వేడుకలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది గనులు, మైనింగ్. ఈ రంగంలో మకుటం లేని మహారాజులా వెలుగొందుతూ వేల కొద్దీ ఆస్తిపాస్తులు సంపాదించిన వారిలో  ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు గాలి జనార్దన్ రెడ్డి. ఆయన తన కూతురు బ్రాహ్మణి వివాహానికి సుమారు 500 కోట్ల వరకు ఖర్చు చేయడంతో దేశవ్యాప్తంగా ఆ పెళ్లి గురించి అందరూ మాట్లాడుకుంటూ నోరెళ్లబెట్టారు. 

 

IHG


అప్పట్లో నోట్ల రద్దు జరిగిన సమయంలో ఈ పెళ్లి తంతు అంత ఘనంగా జరగడం, అంత భారీగా ఖర్చుపెట్టి పెళ్లి చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ పెళ్లిని మించిపోయే రేంజ్ లో  గాలి జనార్దన్ రెడ్డి శిష్యుడు, ప్రస్తుత కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు తన కుమార్తె వివాహానికి సుమారు 600 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ పెళ్లికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పెళ్లి హడావుడి మొదలైంది. తొమ్మిది రోజుల పాటు పెళ్లి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెళ్లికి రావాలంటూ సుమారు లక్ష ఆహ్వాన పత్రికలు పంచారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు తెలుగు, కన్నడ, సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ ఈ వివాహానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 


పెళ్లి కోసం సుమారు 40 ఎకరాలు కేటాయించారు. ఇందులో 23 ఎకరాలు కార్యక్రమాల కోసం 15  ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించారు సుమారు 300 మంది ఆర్టిస్టులు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, నాలుగు ఎకరాల్లో హంపిలోని విరూపాక్ష దేవాలయం సెట్టింగ్ వేస్తున్నారు. కేవలం పూల డెకరేషన్ కోసమే 200 మంది పనిచేస్తున్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పెళ్ళికి పనిచేసిన మేకప్ ఆర్టిస్టులు శ్రీరాములు కుమార్తె రక్షిత మేకప్ కోసం తీసుకువస్తున్నారు. ఇక ఫోటోలు, వీడియోలు తీసేందుకు ముకేశ్ అంబానీ కుమార్తె వివాహం లో పనిచేసిన టీమ్ ను ఇక్కడకి తీసుకొస్తున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ రాజీ పడకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ పెళ్లి వ్యవహారం హాట్  టాపిక్ గా మారింది. సొమ్ములు ఉంటే ఎన్ని సోకులైనా చేయవచ్చు అనే సామెత ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: