ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 59.85 శాతం రిజర్వేషన్లు ఉండకూడదని చెబుతూ, జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను గుర్తు చేసి 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఉండాలని, అలాగే నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.

 

ఈ నేపథ్యంలోనే నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగానే జగన్ మరో కీలక నిర్ణయం తీసుకుని స్థానికంలో పోటీ చేసే వారికి షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో డబ్బులు, లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. డబ్బులు, మద్యం పంచుతూ దొరికితే వారికి కఠిన శిక్ష ఖాయమని, డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తామని, వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని చెప్పారు.

 

అంటే దీని బట్టి చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ అభ్యర్ధి అయిన నగదు, మద్యం పంపిణీ చేస్తే వారికి గట్టిగా మూడుతుంది. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే...ఏ ఎన్నికలైన అభ్యర్ధులు డబ్బులు పంచుతారనేది బహిరంగ రహస్యమే. అలాగే ఏ పార్టీ కూడా దీనికి అతీతంగా లేదన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే జగన్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ దెబ్బకు డబ్బులు, మద్యం పంచిన ఏ పార్టీ అభ్యర్ధికైనా శిక్ష పడుతుందా? అంటే చెప్పలేం.

 

ఎందుకంటే టీడీపీ అభ్యర్ధులు ఒకవేళ డబ్బులు, మద్యం పంచుతూ దొరికితే, వారు గట్టిగా బుక్ అయినట్లే. అదే అధికార వైసీపీ అభ్యర్ధులు దొరికితే స్థానిక నాయకుల అండతో బయటపడే అవకాశముందని రాజకీయ విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా వైసీపీ అభ్యర్ధులు ఈ చట్టం వల్ల ఇబ్బందులు పడరని,  టీడీపీతో సహ మిగిలిన ప్రతిపక్షాలు మాత్రం బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి చూడాలి జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలని ఎంత నిష్పక్షపాతంగా జరుపుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: