ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఓటమి ఎరుగని నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే అవి చిత్తూరులోని కుప్పం, అనంతపురంలోని హిందూపురం నియోజకవర్గాలే. పార్టీ ఆవిర్భావించిన దగ్గర నుండి జరిగిన ఎన్నికలు అంటే, 1983 నుంచి చూసుకుంటే, 2019 వరకు ఈ రెండు చోట్ల కంటిన్యూగా విజయం సాధిస్తూనే ఉంది.  కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 1989 నుంచి పోటీ చేస్తూ, వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇక అక్కడ ఆయనకు చెక్ పెట్టడం, దివంగత వైఎస్సార్‌కు గానీ, ఆయన తనయుడు జగన్‌కు గానీ సాధ్యం కాలేదు.

 

ఇటు హిందూపురంలో నందమూరి ఫ్యామిలీ హవా కొనసాగుతుంది. కొన్ని కొన్ని సార్లు టీడీపీ నుంచి వేరే అభ్యర్ధులు గెలిచిన, ఎక్కువ సార్లు నందమూరి వారే గెలుస్తూ వచ్చారు. ఇక గత రెండు పర్యాయలుగా ఎన్టీఆర్ తనయుడు, చంద్రబాబు బామ్మర్ది, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. 2014లో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన బాలయ్య మంచి మెజారిటీతో గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో బాలయ్యకు చెక్ పెట్టాలని జగన్ అభ్యర్ధిని మార్చిన, బాలయ్యని ఓడించడం కుదరలేదు. రెండోసారి కూడా బాలయ్య అద్భుత విజయం సాధించారు.

 

అయితే ఈ విధంగా సార్వత్రిక ఎన్నికల్లో బావాబామ్మర్దులకు చెక్ పెట్టలేకపోయిన జగన్, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో చెక్ పెట్టడానికి వ్యూహం పన్నుతున్నారు. ఎలా అయిన ఈ రెండు నియోజకవర్గాల్లో మెజారిటీ సర్పంచ్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో గెలిచి వైసీపీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. ఆ మేరకు స్థానిక నేతలకు దిశానిర్దేశం కూడా చేసేశారు.

 

ముఖ్యంగా హిందూపురం మున్సిపాలిటీ, అలాగే కొత్త ఏర్పడిన కుప్పం మున్సిపాలిటీల్లో వైసీపీ జెండా ఎగిరితే బాబు, బాలయ్యలకు చెక్ పెట్టేసినట్లే అని భావిస్తున్నారు. ఎలాగో అధికారంలో ఉండటం అడ్వాంటేజ్ కాబట్టి, ఈ రెండు చోట్ల వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అని అర్ధమైపోతుంది. మొత్తానికైతే బావాబామ్మర్దులకు ఈ సారి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: