విశాఖపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విజయనగరం, విశాఖ రూరల్  జిల్లాల పార్టీ నాయకులతో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రాష్ట్రాభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం రివర్స్ చేసిందని అన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుతోపాటు అనేక ప్రాజెక్టులు అర్ధంతరంగా నిలిచిపోయాయని అన్నారు. ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసినా స్పందన లేదన్నారు.  చేసిన పనులకు చెల్లించాల్సిన రూ.1400 కోట్ల రూపాయలను ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బాధాకరమని అన్నారు.

 

 

``జనసేన పార్టీకి యువతే బలం. పార్టీని యువతే తమ భుజస్కంధాలపై మోస్తోంది. వెనకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మారుమూల గ్రామాల్లో నివసించే కొంతమంది యువతను ఎంపిక చేసి వారికి టికెట్లు ఇచ్చి 2019 సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్ధులుగా నిలబెట్టారు. నాయకత్వ మార్పుతోనే సమాజంలో మార్పు వస్తుందని ఆయన నమ్మారు కనుకే ఇంతమంది కొత్తవారికి  అవకాశం కల్పించారు.`` అని ఆయ‌న పేర్కొన్నారు. 


 
తెలుగుదేశం పార్టీని ప్రజాక్షేత్రంలో నిలదీసింది పవన్ కళ్యాణ్ అని ఈ సంద‌ర్భంగా నాదెండ్ల అన్నారు. ``2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచింది. బీజేపీ కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అనేక ప్రాంతాల్లో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది... నాయకులు ఇష్టానుసారం దోచుకుంటున్నారని పవన్ కళ్యాణ్  ఎన్నిసార్లు హెచ్చరించినా చంద్రబాబు గారు పట్టించుకోకపోవడంతో 2018లో మంగళగిరిలో బహిరంగ సభ పెట్టి ప్రజాక్షేత్రంలోనే తెలుగుదేశం పార్టీ అవినీతిని ఎండగట్టిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్. ప్రజలకు మేలు చేస్తారని నమ్మి మద్దతు ఇస్తే .. బాధ్యతలను విస్మరించి దోచుకోవడమే పరమావధిగా పాలిస్తారా అని నిలదీసింది కూడా మన నాయకుడే.`` అని నాదెండ్ల అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: