వైఎస్ జగన్ మొన్నటి ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించారు. 175 సీట్లకు 151 సీట్లు గెలుచుకుని నభూతో నభవిష్యతి అనిపించారు. దాదాపు 50 శాతంపైగా ఓటింగ్ కూడా సాధించారు. అంతటి బంపర్ మెజారిటీ సాధించిన జగన్ ఇప్పుడు పాలనలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన ఈ ఉగాదికి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారట. ఇంతకీ ఈ కొత్త రికార్డు ఏ విషయంలో అంటారా..?

 

 

ఇళ్ల స్థలాల విషయంలోనట. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అంటున్నారు ఆ పార్టీ నేతలు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అయితే ఇది ఏకంగా ప్రపంచ రికార్డు అని కుండ బద్దలు కొట్టేస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నామని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీకి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.

 

 

పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీ నేతల తీరును డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తీవ్రంగా తప్పుబట్టారు. పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం కన్నీళ్లు తుడిచే ప్రభుత్వమే కానీ.. కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం కాదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో నిబంధనలకి విరుద్దంగా వ్యవహరించటం లేదని సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేశారు.

 

 

చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తమ వైఫల్యాలను వైసీపీ ప్రభుత్వం రుద్దాలని చూస్తున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ దుయ్యబట్టారు. ఇక ఇళ్ల పట్టాల పంపిణీ విషయానికి వస్తే రికార్డుల విషయం ఎలా ఉన్నా.. 25 లక్షల మంది పేదలకు ఇళ్లజాగాలు ఇవ్వడం అంటే మాటలు కాదు.. కానీ.. ఈ పట్టాల కోసం ఇప్పటికే భూమిని అనుభవిస్తున్న పేదల నుంచి లాక్కుంటున్నారన్న కథనాలు వస్తున్నాయి. అది మాత్రం సమర్థనీయం కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: