తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొన్ని సంఘాలనేతలకు మింగుడుపడటం లేదు.. ఇప్పటికే ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘాలపై వేటు వేసిన ప్రభుత్వం.. ఏడాది నుంచి ఓడీ కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ సంఘాలకూ షాకిచ్చినట్లు తెలుస్తుంది.. తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘానికి ఓడీ సౌకర్యం కల్పిస్తూ గుట్టుగా నిర్ణయం తీసుకుందట.. మొత్తం 13 సంఘాలు ఓడీల కోసం నిరీక్షిస్తుండగా.. రెండు సంఘాలకే ఆ సౌకర్యం కల్పించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..

 

 

ఇకపోతే ప్రభుత్వానికి విధేయంగా ఉన్న తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం విషయంలో జనవరి 25న జీవో నంబర్‌ 208ని జారీ చేసింది. అంతే కాకుండా ఈ జీవోలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదని ఆదేశాలు కూడా వెలువడినట్లు సమాచారం.. వాస్తవానికి తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆరు సంఘాలకే ఓడీ సౌకర్యం ఉండగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం దీనిని 13 సంఘాలకు ప్రభుత్వం విస్తరింపజేసింది. 2018 డిసెంబరు 31తో వీటిలో చాలా సంఘాలకు గడువు తీరగా, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నేతకు ఇచ్చిన ఓడీ సౌకర్యం 2019 ఆగస్టు 15తో ముగిసింది.

 

 

టీఎన్జీవో రవీందర్‌రెడ్డి సెలవులతో నెట్టుకురాగా.. ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ విధుల్లో చేరిపోయారు. కాగా,ఓడీ జాబితాలో ఉన్న సంఘాలే జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం కలిగి ఉంటాయి. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే చైర్మన్‌గా వ్యవహరిస్తారు.. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు, రెండు ఉద్యోగ సంఘాలను విస్మయానికి గురి చేసింది.. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది..

 

 

అంతే కాకుండా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉన్న సంఘాలకు ఓడీ సౌకర్యం కల్పించకుండా వివక్ష చూపడం సరికాదని టీఎస్‌ యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి, ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు జి.సదానందం, పర్వతరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వివక్షాపూరిత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: