చివరకు రాజధాని  అమరావతి తరలింపు వ్యవహారాన్ని ఓ ప్రవాస భారతీయుడు అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్ళాడు. అమెరికాలో ఉంటున్న లాయర్ కావేటి శ్రీనివాసరావు నెధర్లాండ్స్ లోని హేగ్ లో ఉన్న అంతర్జాతీయ కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేశాడు. బహుశా తెలుగుదేశంపార్టీకి పిచ్చి ముదిరిపోయిన కారణంగానే అమెరికాలోని లాయర్ తో హేగ్ కోర్టులో కేసు వేయించినట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి పనికిమాలిన వ్యవహారాలు టిడిపి తప్ప ఇంకో పార్టీ చేయదు.

 

అమరావతిలో ఆందోళనలు అయిపోయాయి. రాష్ట్రంలో జోలెపట్టుకుని తిరగటం కూడా అయిపోయింది. రాష్ట్ర గవర్నర్ ను కలవటం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటిలు కూడా అయిపోయాయి. కేంద్రమంత్రులను కూడా కలిశారు. ఎక్కడా లాభం లేదని చివరకు కోర్టుల్లో కేసులు కూడా వేశారు. చివరకు అంతర్జాతీయ న్యాయస్ధానంలో కేసు కూడా వేసేశారు. తర్వాత ఏమి చేయబోతున్నారు ? అన్నదే ఇపుడు ప్రశ్నగా మారింది.

 

నిజానికి రాజధాని ఏర్పాటు వ్యవహారంలో తమ పాత్ర ఉండదని కేంద్రప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు ప్రకటన చేసింది. అయితే పదే పదే రాజధాని తరలింపు వ్యవహారంలో కేంద్రాన్ని లాగాలని టిడిపి శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే హై కోర్టులో కేసులు వేయించి కేంద్రానికి కూడా నోటీసులిప్పించింది. సరే కేంద్రం ఏమని సమాధానం చెబుతుంది ? అప్పుడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది వేరే సంగతి.

 

వాస్తవ పరిస్ధితి ఈ విధంగా ఉంటే ఎక్కడో అమెరికాలో ఉండే ఓ లాయర్ హేగ్ లోని అంతర్జాతీయ కోర్టులో కేసు వేస్తే ఏమవుతుంది ? లాయర్ వేసిన పిటీషన్ తమకు అందినట్లు హేగ్ కోర్టు నుండి ఎక్నాలడ్జిమెంట్ కూడా ఆయనకు అందింది లేండి. అంతమాత్రాన కేసు అడ్మిట్ చేసుకున్నట్లు కాదని, కేసు విచారణ మొదలుపెట్టినట్లు కాదని కూడా అందులో స్పష్టంగా ఉంది.  రెండు దేశాల మధ్య వివాదాలు తేల్చుకోవటానికి ఉద్దేశించిన అంతర్జాతీయ కోర్టులో ఇటువంటి కేసు వేయటమంటే లాయర్ మానసిక పరిస్దితేంటో తెలిసిపోతోంది. స్వయంగా లాయర్ అయ్యుండి కూడా ఈ కేసు వేశాడంటే కేవలం ప్రచారం కోసమే అని తెలియటం లేదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: