కోవిద్ - 19 (కరోనా వైరస్) పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. ఇక చైనా పరిస్థితి అయితే మరీ దారుణం. ఇప్పటికే అక్కడ సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్‌కూ వ్యాపించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌కు చెందిన టెక్కీకి కరోనా పాజిటివ్ రావడంతో ఈ ప్రాంతంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్ర‌స్తుతం ఈ ప్రాంతవాసులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. 


   
దుబాయ్‌ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన టెక్కీకి కరోనా వ్యాది సోకింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఆయన పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా టెక్కీ దుబాయ్‌కు వెళ్లాడు. దుబాయ్‌లోనే ఆయనకు కరోనా వ్యాధి సోకిందని వైద్యులు గుర్తించారు. కర్ణాటక మీదుగా ఆయన సికింద్రాబాద్‌కు చేరుకొన్నారు. వ్యాధి లక్షణాలు నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రిలో ఆయ‌న‌కు చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డ యువకుడు పనిచేస్తున్న బెంగళూరు సాఫ్ట్‌వేర్ కంపెనీ అప్రమత్తమైంది. కంపెనీలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. 

 

ఎలాంటి అనుమానిత లక్షణాలున్నా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కరోనా బాధితుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించిన బస్సులో 12 మంది కర్ణాటక వాసులు ఉన్నారని.. వీరంతా తిరిగి బెంగళూరు చేరుకున్నారని కర్ణాటక వైద్య మంత్రి కె సుధాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వారి వివరాలను ట్రాక్ చేసి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్థుల సంఖ్య తొంభైవేలు దాటింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న పది దేశాల్ని పరిశీలిస్తే... అవి చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, సింగపూర్, అమెరికాగా నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: