స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో ఏపీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటకపోతే పదవులు పోతాయని జగన్ హెచ్చరించిన నేపథ్యంలో మంత్రులు తమ తమ జిల్లాల్లో పార్టీని గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్, మంత్రులకు స్థానిక సమరంపై దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో జగన్ మంత్రులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.

 

మంత్రుల సొంత నియోజకవర్గాల్లో ఓటమి పొందితే ఉపేక్షించే పని లేదని, అవసరమైతే పదవిలో నుంచి తీసేయడానికి వెనుకాడనని జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత ఇంఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులదే అని హెచ్చరించినట్లు సమాచారం. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటకపోతే ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఉండవని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విధంగా జగన్ దగ్గర నుంచి వార్నింగ్‌ రావడంతో మంత్రులు అలెర్ట్ అయ్యారు.

 

ఎలా అయిన తమ స్థానాల్లో పార్టీని గెలిపించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు ఫుల్ యాక్టివ్ అయితే టీడీపీకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గెలుపు కోసం మంత్రులు స్థానికంగా బలంగా ఉన్న టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇన్‌చార్జ్ మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో పార్టీ గెలుపు కోసం టీడీపీని వీక్ చేయాల్సిన అవసరముంది.

 

అయితే ఎలాగో అధికారంలో ఉన్నారు కాబట్టి, ఫలితాలు ఎక్కువగా వైసీపీకే అనుకూలంగా ఉంటాయి. కాకపోతే కొన్ని చోట్ల టీడీపీ బలంగా ఉంది. అలాగే మూడు రాజధానులు వ్యవహారంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ మీద కొంచెం వ్యతిరేకిత కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరముంది. ఇక్కడ బలంగా ఉన్న టీడీపీ నేతలని పార్టీలోకి తీసుకుని సత్తా చాటాలి. ఇక దీని బట్టి చూసుకుంటే వైసీపీకి మెజారిటీ ఫలితాలు అనుకూలంగా రావాలంటే మంత్రులు టీడీపీని ఇంకా వీక్ చేయాల్సిందే. మొత్తానికైతే జగన్ తమ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడం వల్ల టీడీపీకే నష్టం జరిగేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: