రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా ఉందా? అంటే లేదని చెప్పలేం. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు వైసీపీ నేతలని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. అలాగే కొందరు కీలక నాయకులని టార్గెట్‌గా పెట్టుకుని వారిని నానా ఇబ్బందులకు గురిచేశారు. అదేవిధంగా జగన్‌పై ఏ విధంగా విమర్శలు చేశారో, ఆయన్ని ఏ రకంగా అవమానించారో కూడా రాష్ట్ర ప్రజలు చూశారు.

 

అయితే ఐదేళ్లు నానా ఇబ్బందులు పడి ఒక్కసారిగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక, వైసీపీ కార్యకర్తలు ఏమి సైలెంట్‌గా లేరు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ వాళ్ళని ఆడేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణగా గత 9 నెలలు జరిగిన పరిణామాలే నిలుస్తాయి. తమపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని టీడీపీ ప్రతిరోజూ ఆరోపిస్తూనే ఉంది. అలాగే తమ కార్యకర్తలపై దాడికి నిరసనగా సక్సెస్ కాకపోయిన ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

 

ఇక అక్కడ నుంచి తమనే లక్ష్యంగా చేసుకుని వైసీపీ పాలన చేస్తుందని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టే స్థాయికి వెళ్లిపోయింది. ఇటీవల చూసుకుంటే విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు లక్ష్యంగా ఏం జరిగిందో తెలిసిందే. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌కు ఏ విధంగా అవమానం జరిగిందో, అంతకుమించి చంద్రబాబుకు అవమానం ఎదురైంది. బాబుపై చెప్పులు, కోడిగుడ్లు, టమోటాలు కూడా పడ్డాయి. తాజాగా వచ్చి తూర్పుగోదావరి పర్యటనకు వెళ్ళిన నారా లోకేశ్, టీడీపీ కార్యకర్తలని కూడా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు.

 

అయితే ఈ విధంగా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం వల్ల పార్టీకి ఏమన్నా లాభం జరుగుతుందా? అంటే ఏం లేదనే చెప్పుకోవచ్చు. ఏదో వైసీపీ నేతలు లోలోపల ఆనందం పడటం తప్ప. కానీ బాబుకు మాత్రం కాస్త లాభం జరిగేలాగానే కనిపిస్తోంది. ఈ ఘటనల వల్ల చంద్రబాబుకు కాస్త సింపతీ పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ప్రభావం లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై పడి బాబు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాకుండా, కాస్త పరువు దక్కించుకునేలా సీట్లు గెలుస్తారని అంటున్నారు. ఏదేమైనా వైసీపీ నేతలే బాబు పరువు నిలిపేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: