అఫ్గనిస్థాన్ లో అమెరికా సైన్యం ఉంటే ఏంటి.. పోతే ఏంటి అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే తాలిబన్లకు పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటికే లష్కరే తోయిబా లాంటి సంస్థలు పాక్ ప్రోద్బలంతో అఫ్గన్ గడ్డపై నుంచి పనిచేస్తూ ఇండియాను టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు పీస్ డీల్ తర్వాత తాలిబన్లు ప్లాన్ ఎలా ఉండబోతుందనేది ఇండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. 

 

అఫ్గనిస్థాన్ ప్రభుత్వంతో భారత్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ దేశంలో మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కూడా ఇచ్చింది. కానీ తాలిబన్ల వ్యవహారశైలిపై మనకు చాలా అనుమానాలున్నాయి. అమెరికా చెబుతున్నంత తేలిగ్గా వారు మనసు మార్చుకోరనేది మన అధికారుల వాదన. అమెరికా తన సైన్యాన్ని సేఫ్ గా తీసుకెళ్లిపోవడం కోసం హడావిడిగా కుదుర్చుకున్న డీల్.. చివరకు ఉపఖండంలో పరిస్థితుల్ని దిగజారుస్తుందేమోనన్న అనుమానాలు అందరిలో ఉన్నాయి. తాలిబన్లకు ఐసిస్ తో కూడా సంబంధాలున్నాయని అమెరికానే చెప్పింది. కానీ పీస్ డీల్ లో అల్ ఖైదా, ఇతర తీవ్రవాద  సంస్థలతో సంబంధాలు వదులుకోవాలని షరతు పెట్టింది. కానీ తాలిబన్లు చెప్పిన మాటపై నిలబడతారా అంటే సందేహమే. 

 

తాలిబన్లు బేసిగ్గా ఛాందసవాదులు. మధ్యయుగాల నాటి సిద్ధాంతాలే కరెక్టనేది వారి భావన. 1996 నుంచి 2001 దాకా అఫ్గన్లో తాలిబన్ల రాజ్యం నడిచిన తీరు చూస్తే.. ఎవరికైనా వారి ఆలోచన ధోరణి ఏంటనేది తెలిసిపోతుంది. ప్రపంచ ప్రఖ్యాత బొమియన్ బుద్ధ విగ్రహాలు కూల్చొద్దని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి హితవు చెప్పినా తాలిబన్లు పట్టించుకోలేదు. అలాంటి కరడుగట్టిన ఛాందసవాదులు.. ఒక్కసారిగా మనసు మార్చుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారంటే ఎలా నమ్ముతామని అఫ్గన్ పౌరులు ప్రశ్నిస్తున్నారు. అఫ్గాన్ లో సాధారణ పౌరులకు ఉన్నపాటి తెలివి.. అమెరికాకు లేదా అంటే. ఉంది. కానీ స్వప్రయోజనాల కోసం అఫ్గన్ తో పాటు భారత్ ప్రయోజనాల్ని కూడా బలిపెట్టడానికి అమెరికా సిద్ధమైంది. పాకిస్తాన్ పై అతి నమ్మకంతో అఫ్గనిస్థాన్లో శాంతికి ఆ దేశాన్ని పూచీగా ఉంచుతోంది ట్రంప్ సర్కారు. పిల్లికి ఎలక సాక్ష్యంలాగా.. పాకిస్థాన్ ట్రాక్ రికార్డ్ తెలిసీ.. తాలిబన్లను ఆ దేశం ఎలా కంట్రోల్ చేస్తుందని నమ్ముతామనేది భారత్ ప్రశ్న. కానీ ఈ వాదనలేవీ పట్టించుకునే పరిస్థితుల్లో అమెరికా లేదు. అర్జెంటుగా తమ సైన్యాన్ని అఫ్గనిస్థాన్ గడ్డపై నుంచి తరలించేయడమే అజెండాగా పనిచేస్తోంది. 

 

గత 20 ఏళ్లుగా అఫ్గనిస్థాన్ కోసం అమెరికా రక్షణ బడ్జెట్లో భారీ కేటాయింపులు చేయాల్సి వస్తోంది. అమెరికన్ సైనికులు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చాలా మంది మానసిక జబ్బుల బారిన పడుతున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు అఫ్గనిస్థాన్ వెళ్లడానికి ఇతర ప్రాంతాల్లో ఉన్న సైన్యం నిరాకరిస్తుందని కూడా పెంటగన్ నివేదికల్లో ఉంది. ఎవరూ కొత్తగా రాకపోవడంతో..  ఎప్పుడో 2001లో వెళ్లిన సైనికులే అక్కడ ఉండిపోవాల్సి ఉంది. సుదీర్ఘకాలం తుపాకీశబ్దాలు, నిరంతర అప్రమత్తత, బాంబు దాడుల మధ్య ఉన్న సైనికుల మానసిక స్థితి తీవ్రంగా ప్రభావితమౌతోంది. సహజంగా సైనిక చట్టాల ప్రకారం కూడా.. ఒక బ్యాచ్ ను ఒకేచోట ఎక్కువ సమయం ఉంచరు. కానీ అఫ్గాన్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అవసరమైతే ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతాం కానీ.. అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదని అమెరికా సైనికులు కుండబద్దలు కొడుతున్నారని, దీంతో పై అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. దీనికి తోడు ఏటా అఫ్గాన్లో ఉన్న సైన్యానికి అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతోంది. దీంతో సైన్యాన్ని అక్కడ్నుంచి వీలైనంత త్వరగా తెచ్చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే తాలిబన్లతో డీల్ కుదుర్చుకున్నారు. అయితే డీల్ చెప్పినట్టు అమలైతేనే.. సైన్యాన్ని ఉపసంహరిస్తామని క్లాజ్ పెట్టారు కానీ.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారో క్లారిటీ లేదు. 

 

అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అటు ప్రభుత్వం, ఇటు తాలిబన్లు పరస్పరం ఖైదీల్ని మార్పిడి చేసుకోవాలి. తాలిబన్ల దగ్గర వెయ్యి మంది ఖైదీలుంటే.. అఫ్గనిస్థాన్ ప్రభుత్వం దగ్గర పది వేల మంది బందీలున్నారు. తాము వెయ్యి మందిని విడుదల చేస్తామని, ప్రతిగా ఐదు వేల మందిని రిలీజ్ చేయాలని తాలిబన్లు షరతు పెట్టారు. కానీ ఇక్కడే అఫ్గన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అభ్యంతరం చెబుతున్నారు. అంతమందిని ఒకేసారి విడుదల చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని, వాళ్లంతా కరడుగట్టిన ఉగ్రవాదులనేది ఆయన వాదన. పైగా చర్చల ప్రారంభానికి ముందే రిలీజ్ చేస్తామని ఎక్కడా చెప్పలేదని, తాలిబన్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఘనీ చెబుతున్నారు. దీనికి తోడు అఫ్గన్ ఎన్నికల ఫలితాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తాలిబన్లతో చర్చలకు అన్నివర్గాలతో కమిటీ వేయడం కత్తి మీద సాములా మారింది. అసలు అధ్యక్షుడు ఘనీ, విపక్ష నేత ఇద్దరూ ఏ అంశంపైనా ఒక్కతాటిపైకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో తాలిబన్లే చర్చల్లో పైచేయి సాధిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. 

 

అసలు మొదట అఫ్గనిస్థాన్ సర్కారు, తాలిబన్లు ఓ ఒప్పందానికి రావాలని అమెరికా చెప్పింది. కానీ పరిస్థితులు విషమిస్తున్న తరుణంలో.. తానే ముందుకొచ్చి తాలిబన్లతో డీల్ చేసుకుంది. ఇప్పుడైనా అఫ్గన్ సర్కారు, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ చర్చలు మొదలైనా అవి ఎన్నాళ్లు సాగుతాయనేది ఎవరూ చెప్పలేని సంగతి. ఇప్పుడు అమెరికా సైన్యం వెళ్లిపోతే.. తాలిబన్లు పాత బుద్ధి చూపిస్తే.. ఉగ్రవాదులు భారత్ భూభాగాన్ని టార్గెట్ చేయొచ్చని మన ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. దీంతో మన సర్కారు ముందుగానే అప్రమత్తమైంది. అఫ్గాన్ తాలిబన్లను ఓ కంట గమనిస్తూనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: