క‌రోనా వైర‌స్ తెలంగాణ‌లోనూ ప‌లువురికి సోకింద‌న్న వార్త‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఇటు సోష‌ల్ మీడియాలోనూ అటు ప్ర‌ధాన స్ర‌వంతి మీడియాలోనూ జ‌రుగుతున్న ప్ర‌చారంతో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కీల‌క అంశాలు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క వ్యక్తికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని ఆయ‌న పేర్కొన్నారు.  కరోనా సోకిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి, వైద్యులు చికిత్స అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కరోనా సోకిన వ్యక్తి ఇంట్లోని సభ్యులకు పరీక్షలు నిర్వహించాగా, రిపోర్ట్‌ నెగెటివ్‌ వచ్చిందనీ.. ఇంట్లో వాళ్లకే వ్యాధి వ్యాపించనపుడు ఇతరులకు వచ్చే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు.  దుబాయి, ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని మంత్రి తెలిపారు.

 

కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క‌రోనా వైర‌స్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కరోనా వైరస్ మీద తెలంగాణలో వస్తున్న వార్తల పై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త‌ తీసుకుంటుందని ధీమా వ్య‌క్తం చేశారు. హైకోర్ట్ సైతం పలు జాగ్రత్త‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింద‌న్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమ‌వుతున్న తరుణంలో అసెంబ్లీలో కూడా జాగ్రత్త‌లు తీసుకోవాల‌ని కోరారు. మంత్రులు,ఎమ్మెల్యే సైతం విదేశీ పర్యటనలు సహజంగా వెళ్లి వస్తుంటారని...దీంతో  అసెంబ్లీ సమావేశంలో కూడా తగిన జాగ్రత్త‌లు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను జగ్గారెడ్డి మీడియా ద్వారా కోరారు. 

 

కాగా, కరోనాపై వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. కరోనాకు మనిషిని చంపేంత శక్తి  లేదని వైద్యులు చెబుతున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ గుర్తు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఇతరులతో మనం నడుచుకునే విధానమే ఆరోగ్యాన్ని కాపాడుతుందని మంత్రి తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్క్‌ ధరించాలనీ, ఇతరులను పలకరించేటప్పుడు కరచాలనం కాకుండా, నమస్కరిస్తే చాలని మంత్రి వెల్లడించారు.ఇప్పటి నుంచి కేవలం గాంధీ ఆస్పత్రిలోనే కాకుండా ఐసోలేషన్‌ వార్డులు ఉన్న అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ వ్యాధి లక్షణాలున్న వారు శాంపిల్స్‌ ఇవ్వొచ్చనీ, అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఉండి, శాంపిల్స్‌ రిజల్ట్స్‌ వచ్చేంతవరకు వైద్య సేవలు పొందవచ్చాని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు సేవలు అందించేందుకు ముందుకొచ్చాయని మంత్రి తెలిపారు. వైద్యులను సమన్వయ పర్చేందుకు కమిటీ వేస్తామన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: