టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత, మంత్రి కేటీఆర్ అక్ర‌మంగా ఫాంహౌస్ నిర్మించుకున్నార‌ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇదే ఫాంహౌస్ అంటూ రేవంత్ టీం జ‌న్వాడ‌లో హ‌ల్ చ‌ల్ చేసింది. దీనిపై ఇప్ప‌టికే టీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో రేవంత్ దిష్టిబొమ్మ‌ల ద‌గ్ధం జ‌రిగింది. అయితే, తాజాగా ఈ ఎపిసోడ్‌లో మ‌రో అడుగు ప‌డింది. ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిబంధనలను ఉల్లంఘించి జిల్లాలోని మియాఖాన్‌గూడ వద్ద డ్రోన్‌ కెమెరాలను వినియోగించార‌ని పేర్కొంటూ రేవంత్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

 

సైబరాబాద్‌ పరిధిలో డ్రోన్‌ కెమెరా ఉపయోగించడంపై ఇప్పటికే నిషేధం ఉన్నప్ప‌టికీ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను హ‌రించేలా వ్య‌వ‌హ‌రించార‌ని పోలీసులు కేసు న‌మోదు చేశారు. పోలీసులు పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం,కేసు వివరాలిలా ఉన్నాయి.. మార్చి 1న ఎంపీ రేవంత్‌రెడ్డి సోదరుడైన అనుముల కృష్ణారెడ్డి (45) సూచన మేరకు ఉప్పర్‌పల్లికి చెందిన అన్నదమ్ములు విజయ్‌పాల్‌రెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, వీరి స్నేహితుడైన విజయ్‌సింహారెడ్డి కారులో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ ఆఫీస్‌కు వచ్చారు. అక్కడినుంచి డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరణ కోసం ప్రవీణ్‌పాల్‌రెడ్డి, విజయ్‌సింహారెడ్డి కోకాపేటకు వెళ్లి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తిని కలిశారు. జైపాల్‌రెడ్డి స్థానిక యువకుడైన ఓం ప్రకాశ్‌రెడ్డిని వీరికి పరిచయం చేసి చిత్రీకరణకు సహకరిస్తారని చెప్పారు. వీరంతా డ్రోన్‌ కెమెరాతో అక్కడి క్రికెట్‌ గ్రౌండ్ వద్ద ఉన్న ఎత్తు ప్రదేశానికి వెళ్లారు. రహస్యంగా వారు అనుకున్న ప్రాంతంతోపాటు పరిసరాలను చిత్రీకరించి వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారు. వివరాలను కృష్ణారెడ్డికి వాట్సప్‌ ద్వారా పంపించారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి కార్యాలయానికి చేరుకొని పూర్తి సమాచారాన్ని కృష్ణారెడ్డికి అందజేశారు. 

 

ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేసిన నార్సింగి పోలీసులు..ప్రవీణ్‌పాల్‌రెడ్డి, విజయ్‌సింహారెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజేశ్‌ (డ్రోన్‌ ఆపరేటర్‌), శివ, ఓం ప్రకాశ్‌రెడ్డిపై 224/2020లో సెక్షన్‌ 184,187 ఐపీసీ, 11ఏ రెడ్‌ విత్‌ 5ఏ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కింద అభియోగాలు మోపారు. అనంత‌రం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో తేలే అంశాల మేరకు ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి, విజయ్‌పాల్‌రెడ్డి, వీరేశ్‌ను అరెస్టుచేయనున్నారు. వారి అరెస్టు తర్వాత మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: