కరోనా వైరస్‌.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒక చిన్న వైరస్. మొన్నటివరకూ మనం సేఫ్ అనుకుంటే, ఇపుడు ఇండియాతో సహా మరి కొన్ని దేశాలకు ఈ మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది. చైనాలో వందలాది మంది మృత్యవాత పడ్డారు.. పడుతున్నారు. ఏమాత్రం జలుబొచ్చినా, దగ్గొచ్చినా... బీ అలర్ట్‌ అంటున్నారు డాక్టర్లు. చైనాలోని వూహాన్‌లో మొదలైన కరోనా వైరస్‌, ఇప్పటికే వందలాది మందిని బలిగొంది. కరోనా వైరస్‌ పుట్టిన దేశం చైనాలోనే దీనికి విరుగుడు ఇప్పటికీ లభించక పొతే.. మనవాళ్లు మాత్రం అది తాగండి.. ఇది తాగండి... అది తినండి.. ఇది తినండి.. అంటూ గప్పాలు కొడుతున్నారు. 

 

ఐతే ఈ పరిస్థితిని కొందరు మాయగాళ్లు క్యాష్‌ చేసుకోవడం మొదలుపెట్టారు.  ఒక వైపు కరోనా మహమ్మారి వేలాది మందిని పట్టి పీడిస్తుంటే.. కరోనాను దరికి చేరనీయమని, దెయ్యంలా వదిలించేస్తామని, బూటకపు మాటలు చెప్తున్నారు కొందరు ప్రబుద్ధులు. శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లోనే కనుగొన్నారని... ఇన్నాళ్లు నిద్రావస్థలో ఉన్న వైరస్‌ ఒక్కసారిగా జడలు విప్పుకుందని ప్రచారం చేస్తున్నారు కొందరు కర్కోటకులు.

 

తమిళనాడుకి చెందిన ఓ వైద్యుడు కరోనా నివారించే మందు కనుక్కున్నాని అంటున్నాడు. తాను తయారు చేసిన ఔషదాన్ని తాగితే 24 నుంచి 48 గంటల్లోనే కరోనా దరికి చేరదని, కరోనా లక్షణాలను బట్టి వనమూలికలతో ఔషదం తయారు చేశానంటున్నాడు డాక్టర్‌ ధనికసాలం వేణి. హోమియోపతి మందులు వాడండని ఒకరు... అల్లోపతి మందులు వాడండని ఒకడు, నాటు వైద్యమని మరికొందరు... ఉదయాన్నే  నేను చెప్పిన డైట్‌ చేసి పచ్చికూరలు తింటే చాలని మరికొందరు... ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. 

 

ఇవేవి తెలియని ప్రజలు, మాయగాళ్ల మాటలు వింటున్నారు. వీరినే టార్గెట్‌ చేస్తూ... సొమ్ము  చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. మా హోటల్‌లో ఒక్క ఊతప్ప తినండి చాలు... కరోనానే కాదు దాని జేజమ్మ కూడా ఏం చేయలేదు అంటున్నాడు చెన్నైలోని ఓ హోటల్‌ ఓనర్‌. ఇలా ప్రజల బలహీనతను డబ్బు చేసుకుంటున్నారు ఇలాంటి సన్నాసులు. కాబట్టి జనులారా.. కరోనాకు ఇంకా విరుగుడు దొరకలేదు.. ఇది సత్యం... కనుక జాగ్రత్తగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: