తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికీ కరోనా సోకలేదని చెప్పారు. కరోనా లక్షణాలు ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. వాట్సాప్, సోషల్ మీడియాలో కరోనా గురించి దుష్ప్రచారం జరుగుతోందని పుకార్లను నమ్మవద్దని కోరారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా ప్రభుత్వానికి ఉందని చెప్పారు. 
 
కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా పేషంట్ కు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న రెండు కేసులు నెగిటివ్ వచ్చాయని మైండ్ స్పేస్ ఉద్యోగికి కూడా నెగిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ వ్యక్తి కూడా కోలుకుంటున్నాడని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిందని అన్నారు. 
 
కరోనాపై ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్ లో కరోనా ప్రభావం పెద్దగా లేదని చెప్పారు. అపోలోలో శానిటేషన్ మహిళకు కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని పేర్కొన్నారు. నిన్న 21 నమూనాలను టెస్ట్ చేస్తే అన్ని శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయని అన్నారు. లేనిపోని పుకార్లు క్రియేట్ చేసి ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దని సూచించారు. 
 
కరోనా వైరస్ గాలితో వ్యాపించేది కాదు.. ఒకే రూమ్ లో ఉన్న అందరికీ వస్తుందని వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పారు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గితే, తుమ్మితే ఆ తుంపర్లు నేరుగా వేరొక వ్యక్తి ముక్కు, నోరు, కంటిలో పడితే మాత్రమే కరోనా సోకుతుందని అన్నారు. ప్రజలకు 104 ద్వారా ఎలాంటి సమాచారం కావాలన్నా లభిస్తుందని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైతే ఐసోలేషన్ వార్డులు ఉన్నాయో వారికి అక్కడ ట్రీట్ మెంట్ ఇచ్చేలా అనుమతులు ఇచ్చామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: