స్థానిక సంస్థల ఎన్నికలని సీఎం జగన్ సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చినా, స్థానిక ఎన్నికలని లైట్‌గా తీసుకోకుండా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చేశారు. అలా కాకుండా ఎవరైనా అలసత్వం వహించి, స్థానిక సంస్థల్లో మెరుగైన ఫలితాలు రాబట్టకపోతే పదవులు ఊడతాయని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. అటు ఎమ్మెల్యేలు సరిగా పని చేయకపోయిన వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని చెప్పేశారు.

 

ఇక సీఎం నుంచి డైరక్ట్‌గా వార్నింగ్ రావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కష్టపడటానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు సరైన పనితీరు కనబరచని వారు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే రాయలసీమలో కొంచెం కష్టపడిన వైసీపీ అదిరిపోయే ఫలితాలని రాబట్టగలదు. ఎందుకంటే సీమ ఎప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. 2014లో అధికారం రాకపోయిన మంచి ఫలితాలే రాబట్టింది. ఇక 2019 ఎన్నికల్లో అయితే చెప్పనక్కర్లేదు.

 

మొత్తం 52 సీట్లకు గాను 49 సీట్లు గెలుచేసుకుంది. దీని బట్టి చూసుకుంటే స్థానిక పోరులో వైసీపీ నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా వైసీపీకి పరిస్థితులు అనుగుణంగా ఉండటం వల్ల, ఈ 9 నెలల్లో అదిరిపోయే పనితీరు కనబరచని మంత్రులకు కలిసొస్తుంది. అయితే చిత్తూరులో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్నూలులో ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు ఎలాగో తిరుగులేదు కాబట్టి, వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

 

ఈ ఇద్దరు కాకుండా మిగిలిన మంత్రులు ఈ 9 నెలల్లో కాస్త వెనుకబడి ఉన్నారని అర్ధమవుతుంది. అయితే వారి పనితీరుతో సంబంధం లేకుండా వైసీపీ గాలి మీద, వారి నియోజకవర్గాల్లో జరిగే స్థానిక పోరులో సత్తా చాటవచ్చు. ఇక మెజారిటీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుంది కాబట్టి, జగన్ వార్నింగ్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. వారి పదవులకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: