కింజరాపు రామ్మోహన్ నాయుడు..దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు. తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్...2014లో టీడీపీ తరుపున శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు. ఇక అక్కడ నుంచే రామ్మోహన్ హైలైట్ అవ్వడం మొదలైంది. ఎర్రన్న వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చినా... ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. టీడీపీ ఎంపీగా పార్లమెంట్‌లో అదిరిపోయే విధంగా తన గళం వినిపించి, దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి వాక్చాతుర్యంతో బీజేపీపైనే విమర్శలు చేసి ఆకట్టుకున్నారు.

 

ఇక ఆ విధంగా ఎంపీగా రాణించడంతోనే, రెండోసారి కూడా రామ్మోహన్ గెలవగలిగారు. రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్న, రామ్మోహన్ విజయం మాత్రం ఆగలేదు. అయితే రెండోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌.. పార్లమెంట్‌లో మళ్ళీ తన తడాఖా చూపిస్తూనే ఉన్నారు. రాష్ట్ర సమస్యలపై ఎప్పటికప్పుడు కేంద్రాన్ని నిలదీస్తూనే ఉన్నారు. అటు కేంద్రంలోనే కాకుండా, ఇటు రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానంలో ఉంటూ అధికార వైసీపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

 

అయితే మొదట్లో సబ్జెక్ట్ పరంగా విమర్శలు చేసే రామ్మోహన్‌లో ఇప్పుడు మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అధికార వైసీపీపై దూకుడుగానే వెళుతున్నారు. తన మాటలకు పదును పెట్టి మరి, ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల లోక్‌సభలో తాను స్పీచ్‌ని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే అలా అడ్డుకోవడంపై రామ్మోహన్ బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ...లోక్ సభలో కాదు రాష్ట్రంలో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.

 

ఇక తాజాగా ఉత్తరాంధ్ర యాత్రకు వచ్చిన చంద్రబాబుని వైసీపీ శ్రేణులు విశాఖ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ఈ ఘటనపై కూడా వైసీపీ ప్రభుత్వంపై రామ్మోహన్ తీవ్రంగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా కూడా ఫేస్‌బుక్ లైవ్‌లో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుని ఎక్కడ ఆపారో... మళ్ళీ అక్కడ నుంచే చంద్రబాబుని తీసుకొచ్చి యాత్ర మొదలుపెడతామని, దమ్ముంటే ఆపుకోవచ్చని వార్నింగ్ ఇచ్చారు. అయితే రామ్మోహన్ ఈ స్థాయిలో మాట్లాడటానికి, వైసీపీనే కారణమని అర్ధమవుతుంది. కావాలనే వైసీపీ ఇలా టీడీపీని ఇబ్బందులు పెడుతుందని భావిస్తున్న రామ్మోహన్, కాస్త అగ్రెసివ్‌గానే మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: