పార్టీలో జరుగుతున్న చర్చలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తాజాగా చేసిన చట్టం విషయంలో టిడిపి నేతలు భయపడుతున్నట్లు మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి మాటలను బట్టి తెలిసిపోతోంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణిని నియంత్రించేందుకు జగన్మోహన్ రెడ్డి కొత్తగా చట్టం చేసింది. కొత్త చట్టం ప్రకారం ఎవరైనా డబ్బు, మద్యం పంచుతూ దొరికితే వెంటనే అరెస్టు చేస్తారు. దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తే, పంపిణీ నిజమే అని తేలితే సదరు అభ్యర్ధి లేకపోతే నేతలకు రెండేళ్ళు జైలుశిక్ష ఖాయం. అలాగే ఎన్నికల్లో పోటికి అనర్హునిగా తేలుస్తారు.

 

నిజానికి ఇటువంటి చట్టాలు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకే ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏదో ఫిర్యాదు వచ్చిందన్న కారణంతో ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెట్టటానికే ఇటువంటి చట్టాలు చేసినట్లు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిపై టిడిపి ఆరోపణలు చేస్తోంది. కాబట్టి రేపటి ఎన్నికల్లో తమ నేతలపై ప్రభుత్వం కేసులు పెట్టి జైళ్ళకు పంపటం ఖాయమని పార్టీలో చర్చ జోరందుకుంటోంది. ఇదే విషయాన్ని జేసి స్పష్టంగా ప్రకటించాడు.

 

ఎన్నికల్లో పోటి చేసి వైసిపితో గొడవలుపడి  కేసులు పెట్టించుకుని జైళ్ళకు వెళ్ళేందుకు తాము సిద్ధంగా లేమని జేసి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కొట్ట చట్టం కారణంగానే తమ మద్దతుదారులు కూడా ఎన్నికల్లో పోటికి ఇష్టపడటం లేదని జేసి చెప్పేశారు. అంటే పార్టీలో కొత్తచట్టం విషయంపై నేతలు ఎంత భయంగా ఉన్నారో అర్ధమైపోతోంది.

 

ఇంత భయపడుతూ ఎంతమంది ధైర్యంగా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేసి వైసిపిని ఎదుర్కొంటారనే విషయాన్ని చంద్రబాబునాయుడు ఆరాతీస్తున్నాడు. ఇదే విషయాన్ని నేతలతో ప్రతిరోజు  జరిగే టెలికాన్ఫరెన్సుల్లో కూడా ప్రస్తావిస్తున్నారు. అంటే కొత్త చట్టం వల్ల టిడిపి నుండి అసలు పోటి చేసే వాళ్ళే ఉండరని అనుకునేందుకు లేదు లేండి. ఏదేమైనా ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మాత్రం సంచలనంగా మారిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: