చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకోవాలంటే ఎంతో కాలం జరగదని ఇపుడు వంగవీటి రాధకృష్ణకు అర్ధమవుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇపుడు అందరిలోను ఇదే అనుమానం మొదలైంది.  తండ్రి, దివంగత నేత వంగవీటి రంగా పేరు చెప్పుకునే చాలా కాలంగా  కొడుకు రాధాకృష్ణ రాజకీయాలు చేస్తున్నాడు. రంగా మైనస్ రాధ = జీరో అన్న విషయం ఇప్పటికే అందరికీ అర్ధమైపోయింది. అయినా రాధాకు మాత్రం తత్వం బోధపడినట్లు లేదు.

 

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే రాధాను విజయవాడ రాజకీయాల నుండి తప్పించి గుంటూరు జిల్లాకు పంపాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. రాధాకు ఇష్టమున్నా లేకపోయినా గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయాడట ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. విషయం ఏమిటంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించే గట్టి నేత టిడిపిలో లేడు. అదే సమయంలో రాధాకు ఏదో ఓ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించాలి. దాంతో ఉభయ తారకంగా ఉంటుందని రాధాకు సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం.

 

ఇక్కడ గమనించాల్సిందేమంటే సత్తెనపల్లిని దివంగత నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎంత కంపు చేయాలో అంతా చేసేశాడు. నియోజకవర్గాన్ని కొడుకు శివరామకృష్ణకు రాసిచ్చేయటంతో అవినీతి, అరాచకాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో మొన్నటి ఎన్నికల్లో కోడెల ఘోరంగా ఓడిపోయాడు. తర్వాత కొడుకు అరాచకాలు బయటపడటం, అరెస్టవ్వటం తదితర కారణాలతో నియోజకవర్గంలో పార్టీ బాగా గబ్బు పట్టిపోయింది. దాంతో బాధ్యతలు తీసుకోవటానికి నేతలెవరూ ముందుకు రావటం లేదట.

 

ఈ నేపధ్యంలోనే రాధాను ఇక్కడికి పంపేస్తే సరిపోతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఎలాగూ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు బాగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుండే రాధా పని మొదలుపెడితే సరిపోతుందని కొందరు నేతలు చంద్రబాబుకు సూచించారట. దాంతో చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని తెలిసింది. అంటే రాధాను శాస్వతంగా విజయవాడ రాజకీయాల నుండి పక్కకు తప్పిస్తున్నట్లే అని అనుకోవాలి. మరి అదే నిజమైతే రాధా ఏమి చేస్తారు ? ఇపుడిదే అంశంపై పార్టీలో ఉత్కంఠ పెరిగిపోతోంది. చూద్దాం ఏమవుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: