నూతన పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన‌ విధానాల‌ను రూపొందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒకింత దూకుడుగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయ‌న ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీ సనోఫి ముఖ్యుల‌తో భేటీ అయ్యారు. సంస్థ‌ అంతర్జాతీయ భాగస్వామ్యాల అధిపతి ఫాబ్రిస్ జెఫ్రాయ్, ఇండియా మరియు సౌత్ ఏషియా జీఎం అన్నపూర్ణ దాస్ తో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. వీరితోపాటు  శాంతా బయోటెక్ చైర్మన్ కే ఐ వరప్రసాద్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు.

 

ఈ సందర్భంగా తెలంగాణలో తమ సంస్థ కార్యకలాపాలు మరియు భవిష్యత్ ప్రణాళికలపైన చర్చించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వ పారిశ్రామిక విధానాల పట్ల సానుకూల ఫీడ్ బ్యాక్‌ను మంత్రి కేటీఆర్‌కు సనోఫి ప్రతినిధి బృందం తెలియజేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మరియు నూతన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రస్తుతం ఇక్కడే ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇలాంటి కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

 

ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ వ్యాక్సిన్ క్యాపిటల్ గా రూపాంతరం చెందిందని, ఇక్కడ వ్యాక్సిన్ తయారీకి మరియు సంబంధిత రంగాల్లో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్, దాన్ని మరింత బలపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యకలాపాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉండటంతోపాటు ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న టెక్నాలజీ, మరియు అద్భుతమైన మానవ వనరుల నేపథ్యంలో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వంటి వినూత్న రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

 

2021 సంవత్సరాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు చేపడుతుందని, ఇప్పటికే అనేక ఫార్మా దిగ్గజం కంపెనీలు తమతో కలిసి  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం లో భాగస్వాములు అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తో  సనోఫి కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో సనోఫి కార్యకలాపాల కోసం కావాల్సిన ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకుకైన తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: