ఊహించిందే జ‌రిగింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స‌ర్కారు  వేతనజీవులకు చేదువార్తను వినిపించింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిశీలన జరుపుతోంద‌ని, కోత విధించే అవ‌కాశం ఉంద‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను నిజం చేస్తూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ప్రావిడెంట్‌ ఫండ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించింది. దాదాపు 6 కోట్ల ఖాతాదారులను నిరాశపరుస్తూ ఏడేళ్ల‌ కనిష్ఠ స్థాయిలో 8.50 శాతానికే పరిమితం చేసి షాక్ ఇచ్చింది.

 

పెట్టుబడులపై లాభాలు తగ్గడం కార‌ణంగా 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి (15 బేసిస్‌ పాయింట్లు) తగ్గించాలని ఈపీఎఫ్‌వో భావిస్తున్నట్టు వార్త‌లు వ‌చ్చాయి. మార్కెట్లలో ఈపీఎఫ్‌వో మొత్తంగా రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. వీటిలో 85 శాతం నిధులను డెట్‌ మార్కెట్లలో, మరో 15 శాతం నిధులను ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టింది. దీంతో ఈక్విటీల్లో పెట్టిన పెట్టుబడులు గతేడాది మార్చి నాటికి 14.74 శాతం లాభాలతో రూ.74,324 కోట్లకు చేరాయి.ఇబ్బందులతో సతమతమవుతున్న రెండు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో) ఈపీఎఫ్‌వో రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల దివాలా ప్రక్రియ కొనసాగుతుండటంతో వాటి నుంచి ఇప్పటికిప్పుడు ఈపీఎఫ్‌వో సొమ్ము రికవరీ అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దీంతో వ‌డ్డీ త‌గ్గించింది.

 


గురువారం ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ) సమావేశం జరిగింది. ఇందులో పీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 8.65 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గించింది. సమావేశం అనంతరం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయంతో ఈపీఎఫ్‌వోకు రూ.700 కోట్లకుపైగా మిగులు ఉంటుందని చెప్పారు.  గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇది 8.65 శాతంగా ఉన్నది. 2012-13 తర్వాత పీఎఫ్‌ డిపాజిట్లపై కల్పించిన వడ్డీరేట్లతో ఇదే అత్యంత తక్కువ కావ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: