బెంగుళూరు - మంగుళూరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టాయి. కాగా ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు చేసిన తప్పుకి మొత్తం, ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. కర్ణాటకలో ఈరోజు ఉదయం జరిగిన ఈ సంఘటన తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. కార్లు పల్టీలు కొట్టడంతో వాహనాల్లోని వారు తీవ్రంగా గాయపడ్డారు. కునిగల్ తాలూకా అమరితూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాడ్‌కేరే వద్ద ఈ ఉదయం 3.00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

 

వివరాలిలా వున్నాయి.. బెంగళూరు నుంచి నలుగురు కుర్రాళ్ళు కారులో ధర్మస్థలికి ప్రయాణిస్తుండగా, వారి  వాహనం అమరితూరు వద్ద అదుపుతప్ప, డివైడర్‌ను ఢీకొట్టడంతో, అదే సమయంలో ఎదురుగా వస్తున్న తవేరా వాహనాన్ని సదరు కారు ఢీకొట్టడంతో రెండూ రోడ్డుపైన పల్టీలు కొట్లాయి. దాంతో కారులోని నలుగురు, తవేరాలోని తొమ్మిది మంది మొత్తం 13 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. 

 

తమిళనాడులోని హోసూరుకి చెందిన ఓ కుటుంబం తొమ్మిది నెలల చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించడానికి తమ బంధువులతో కలిసి తవేరా వాహనంలో ధర్మస్థలి మంజునాథస్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం పూర్తయిన తర్వాత హోసూరుకు వెళ్తుండగా.. ఊహించని విధంగా కారు అకస్మాత్తుగా  ఎదురుగా రావడంతో, తవేరాను డ్రైవర్ అదుపుచేయలేకపోయాడు. దీంతో వాహనం పల్టీలుకొట్టి రోడ్డుపై దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన సంభవించింది. 

 

చనిపోయిన వారి వివరాలు.. మంజునాథ్-35, తనూజ-25, గౌరమ్మ -60, రత్నమ్మ -52, సౌందరాజన్-48, రాజేంద్ర-27, సరళ-32, ప్రసూన-14, మాలాశ్రీ-4గా గుర్తించారు. కారులోని యువకులు లక్ష్మీకాంత్-24, సందీప్-36, మధు-28 మృతిచెందారు. గాయపడిన శ్వేత-32, హర్షిత-12, గంగోత్రి-14, ప్రకాశ్‌ను చికిత్స నిమిత్తం కునిగల్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసుని  నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కారు నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వారు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: