కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రజలెవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు తిరుమలలో కరోనా వ్యాపించకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

 

రోజురోజుకు కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన కొనుగోళ్లు, ఇతర నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

 

ఏపీలో కరోనా వైరస్‌పై ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. వివిధ దేశాల నుంచి వచ్చిన 330 మంది ప్రయాణీకులను పరిశీలనలో ఉంచామని.. వారిలో 102 మందికి వారి ఇళ్లలోనే వైద్య పరిశీలనలో ఉంచమని పేర్కొంది. మిగిలిన 216 మందిలో ఇప్పటి వరకూ 23 మంది శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించగా.. 11 శాంపిల్స్ నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని తెలిపింది. అయితే 12 శాంపిల్స్ ఫలితం ఇంకా రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర, జిల్లాల స్థాయిలో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోధన, జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది. విశాఖలో కరోనా కలకలం రేపుతోంది. మలేషియా, బెహరైన్ నుంచి వచ్చిన ఐదుగురిలో కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ఎయిర్ పోర్ట్‌ స్క్రీనింగ్ తర్వాత చెస్ట్ ఆసుపత్రిలో చేర్పించి వారికి వైద్యం అందిస్తున్నారు. కరోనాతో పాటు స్వైన్‌ ఫ్లూ పరీక్షల కోసం శాంపిల్స్ హైదరాబాద్ పంపించారు వైద్యులు.  

 

ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కలకలం రేపుతోంది. ఓ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్రాన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఈ యువకుడు 3వ తేదీన ఒంగోలు వచ్చాడు. జర్మనీ, మస్కట్, బెంగళూరు మీదుగా ఒంగోలుకు చేరుకున్నాడు. రెండు రోజులుగా అతడు జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాడు. దీంతో రిమ్స్ హాస్పటల్ లో చేరాడు. మరోవైపు యువకుడి తండ్రికి కూడా రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇద్దరినీ రిమ్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు వైద్యులు. 

 

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో స్థానికుల అత్యుత్సాహం ఓ మహిళా కండెక్టర్‌ను ఆసుపత్రిపాలు చేసింది. సత్తుపల్లి డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ జ్వరం, జలుబుతో  బాధపడుతోంది. బస్సులోని ప్రయాణికులు ఇవి కరోనా లక్షణాలేనంటూ బలవంతంగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. సాధారణ జ్వరమే అయినా కొందరు కరోనా అంటూ పుకార్లు పుట్టిస్తున్నారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. 

 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తిరుమలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ అదేశాల మేరకు మాస్క్ లు, వైద్య బృందాన్ని అందులో ఉంచామన్నారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి భయం అవసరం లేదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: