రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై వైసీపీలో కసరత్తు మొదలైంది. ఎవరెవరిని ఎంపిక చేయాలి అనేదానిపై పార్టీ అధినేత, సీఎం జగన్‌ స్వయంగా పార్టీ సీనియర్‌ నేతలతో మంతనాలు జరిపారు. అయితే ఇప్పటికే పరిమల్‌ నత్వానీ పేరు ఖరారైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడంతో... అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు... వైసీపీ అధినేత, సీఎం జగన్‌. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరిపారు. అందుబాటులో ఉన్న వారితో సమావేశమై చర్చించిన జగన్‌... అందుబాటులో లేనివారితో ఫోన్‌లో మాట్లాడారు. నాలుగు స్థానాల్లో అభ్యర్ధుల ఖరారుపై సమాలోచనలు జరిపారు.

 

అభ్యర్థులుగా ఎవరెవరి పేర్లను పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై పార్టీ నేతల నుంచి సలహాలు తీసుకున్నారు జగన్‌. పార్టీకి విధేయులైన వారితో పాటు, సామాజిక సమీకరణాలు కూడా కలిసి వచ్చేలా రాజ్యసభ అభ్యర్ధులను ఎంపిక చేయాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి అండగా నిలిచిన వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా జగన్‌ ఆలోచనలు ఉన్నాయని అంటున్నాయి. అయితే ఇంకా సమయం ఉండటంతో... అభ్యర్థుల ఎంపికపై అంత తొందరేమీ లేదని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అది సముచితంగానే ఉంటుందంటున్నారు. 

 

అయితే నలుగురిలో ఒకరిగా ఇప్పటికే పరిమల్‌ నత్వానీ పేరు ఖరారైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పారిశ్రామిక వేత్త అయిన పరిమల్‌ నత్వానీ... ఇప్పటికే జార్ఖండ్‌ నుంచి రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2008లో తొలిసారి, 2014లో రెండోసారి రాజ్యసభ ఎంపీ అయిన పరిమల్‌ నత్వానీ పదవీ కాలం... ఏప్రిల్‌ 19తో ముగుస్తోంది. ఇప్పుడు ఆయన మూడోసారి ఏపీ నుంచి వైసీపీ తరఫున ఎన్నికయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇతనికోసం రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి జగన్‌తో భేటీ అయ్యారు..

 

మరోవైపు రాజ్యసభ రేసులో మంత్రి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, అయోధ్యరామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటూ పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మండలి రద్దుకు జగన్‌ నిర్ణయం తీసుకోవడంతో... పార్టీలో రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అందులో ఎవరికి అదృష్టం దక్కుతుందోనని... వైసీపీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: