పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా ఓ కీల‌క బ్యాంక్‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు మదుపరులకు అత్యంత ఇష్టదాయకమైన సంస్థగా ఉన్న యెస్‌ బ్యాంక్‌లో యాజమాన్య మార్పులు జరిగిన దగ్గర్నుంచి కష్టాలు మొదలైయ్యాయి. గత ఏడాది మార్చిలో కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రవ్నీత్‌ గిల్‌ రాగా, గత ఆరు నెలలుగా రూ.15 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు నానా సమస్యల్ని ఎదుర్కొంటుంది. తాజాగా, యెస్ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించ‌డం వ‌ల్ల ఆ బ్యాంకు ట్రేడింగ్‌లో బోరుమంది.  కేవ‌లం 50 వేలు మాత్ర‌మే విత్‌డ్రా చేసుకోవాల‌ని ఆర్బీఐ ఆంక్ష‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో ఇవాళ యెస్ బ్యాంకు షేర్లు 85 శాతం ప‌డిపోయాయి. 

 


మ‌రోవైపు ప్ర‌భుత్వం ప‌రంగా యెస్ బ్యాంక్ విష‌యంలో స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)లు యెస్‌ బ్యాంక్‌ను ఆదుకోవాలని ఎస్బీఐకి సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎస్బీఐతోపాటు ప్రైవేట్‌ రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహీంద్రా, యాక్సిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లతో కూడిన కూటమి యెస్‌ బ్యాంక్‌కు చేయూతనివ్వనున్నాయి. ముంబైలో జరిగిన ఎస్బీఐ బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలియవస్తుండగా, ఏ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై మాత్రం సమాచారం లేదు. మరోవైపు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీని కూడా వాటా కొనుగోలుకు మోదీ సర్కారు ముందుకు తోస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే యెస్‌ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 8 శాతం వాటా ఉంది.

 

కాగా, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ఆర్బీఐ విశ్వప్రయత్నాలనే చేస్తుంది. సంస్థ పునరుద్ధరణలో భాగంగా గురువారం మారటోరియం విధించిన సెంట్రల్‌ బ్యాంక్‌.. నగదు ఉపసంహరణలపైనా పరిమితులు పెట్టింది. ఖాతాదారులు నెలకు రూ.50 వేలకు మించి తీసుకోరాదని నిర్ణయించింది. అంతకుమించి కావాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. ఇక తక్షణమే బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్‌ కుమార్‌ను బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. డిపాజిటర్ల ప్రయోజనాల రక్షణార్థం ప్రభుత్వంతో చర్చించి ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. యెస్ బ్యాంకు స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని తెలిసిన త‌ర్వాత‌నే ఆర్బీఐ జోక్యం చేసుకుంద‌ని అన్నారు. బ్యాంకుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలంటే, ఆ బ్యాంకుల‌కు కొంత స‌మ‌యం ఇవ్వాల‌న్నారు. యెస్ బ్యాంకుకు మ‌ళ్లీ జీవం పోసేందుకు 30 రోజుల గ‌డువు ఇచ్చామ‌ని, కానీ అంత క‌న్నా ముందే ఈ ప్ర‌క్రియ పూర్తి అవుతుంద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: