కరోనా..! కరోనా..! ఈ మాట వినిపిస్తే చాలు ప్రపంచం వణికిపోతోంది. ఏ ఒక్కరంగాన్నీ వదిలిపెట్టని ఈ వైరస్‌.. ఇప్పుడు క్రీడలనూ భయపెడుతోంది. ప్రధానంగా ఇది ఒలింపిక్స్‌ జరిగే ఏడాది కావడంతో క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. టోక్యోకు అర్హత సాధించాలనే ఆశతో ఉన్న ప్లేయర్స్‌పై కరోనా పంజా విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్వాలిఫయింగ్‌ టోర్నీలు వైరస్‌ కారణంగా రద్దవడం, లేదా వాయిదా పడుతుండటం.. వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది.

 

ఒలింపిక్స్‌లో పతకం మాట అటుంచితే.. ఈ టోర్నీ అర్హత సాధించాలని చాలామంది క్రీడాకారులు కలలు కంటారు. అయితే ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతున్న చాలామంది క్రీడాకారులు.. కరోనా కారణంగా ఆందోళన చెందుతున్నారు. ఒలింపిక్స్‌లో ఆడేందుకు దోహదం చేసే కీలకమైన టోర్నమెంట్లు కరోనా కారణంగా వాయిదా పడుతుండటంతో.. తమ ఆశలు ఆవిరవుతాయేమోనని భయపడుతున్నారు. వచ్చేనెల చైనా వూహాన్‌లో ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ జరగాల్సి ఉండగా.. ఆ టోర్నీని ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాకు తరలించారు. జువెంటన్‌-ఏసీ మిలాన్‌ జట్ల మధ్య జరగాల్సిన ఇటాలియన్‌ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌పైనా కరోనా ప్రభావం పడింది. 

 

టోక్యోలో జరగాల్సిన రగ్బీ ఒలింపిక్‌ టెస్ట్‌ ఈవెంట్‌ రద్దయ్యింది. వచ్చేనెల 25, 26 తేదీల్లో జరగాల్సిన ఈ పోటీలను కరోనా భయంతో రద్దు చేసినట్టు జపాన్‌ రగ్బీ ఫుట్‌బాల్‌ యూనియన్‌ ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు నాన్జింగ్‌లో జరగాల్సిన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ చాంపియన్‌షిప్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఉభయ కొరియాల్లో జరగాల్సిన ప్యాంగ్‌యాంగ్‌, సియోల్‌ మారథాన్‌లను రద్దు చేశారు. వుహాన్‌లో జరగాల్సిన ఒలింపిక్‌ బాక్సింగ్‌ అర్హత పోటీలను జోర్డాన్‌కు తరలించారు. ఈనెలలో నిర్వహించాల్సిన అన్ని రకాల బాక్సింగ్‌ టోర్నీలను జపనీస్‌ బాక్సింగ్‌ సంఘం రద్దు చేసింది.

 

చైనాలో నిర్వహించాల్సిన అన్ని ఫుట్‌బాల్‌ ఈవెంట్లూ రద్దయ్యాయి. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో.. యూరో-2020లో కొన్ని మ్యాచ్‌లను రద్దు చేసే అవకాశం ఉంది. వచ్చే నెల 19న నిర్వహించాల్సిన చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ కూడా వాయిదాపడగా.. ఆస్ట్రేలియా గ్రాండ్‌ ప్రీకి మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రీ, వియత్నాం గ్రాండ్‌ ప్రీని షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించే అవకాశాలున్నాయి. 

 

కోవిడ్‌ భయం.. టెన్నిస్‌ని సైతం వదలడం లేదు. తమ టీమ్‌ వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో.. ఈ నెల 6 నుంచి రొమేనియాతో జరగాల్సిన డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ను చైనా వదిలేసుకొంది. చైనాలో వచ్చే నెలలో షెడ్యూల్‌ చేసిన జియాన్‌ ఓపెన్‌నూ రద్దు చేశారు. జపాన్‌-ఈక్వెడార్‌తో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ను ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించనున్నారు. కరోనా దెబ్బకు భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్స్‌ ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ నుంచి భారత సింగిల్స్‌ షట్లర్‌ HS ప్రణయ్‌, పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ షెట్టి వైదొలిగారు. ఈనెల 11న బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఈ ఒలింపిక్స్‌ క్వాలిఫైయింగ్‌ టోర్నీలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌ మాత్రం ఆడుతున్నారు. ఈ టోర్నిలో స్థాయికి తగ్గట్లు ప్రదర్శన చేస్తేగాని.. ఒలింపిక్స్‌లో అర్హత సాధించని పరిస్థితి. 

 

అటు ఐపీఎల్‌పైనా కూడా కరోనా వైరస్‌ ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఐపీఎల్ ఆడేందుకు తమ ఆటగాళ్లను భారత్‌ పంపేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెనకాడుతోంది. వైరస్‌ను నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నాకే తమ ప్లేయర్స్‌ను భారత్‌కు పంపుతామని కివీస్‌ క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక వచ్చిన తర్వాతే.. పునరాలోచిస్తామని స్పష్టం చేసింది. కాగా, ఐపీఎల్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనైనా నిర్వహిస్తామని గంగూలీతో పాటు బ్రిజేష్‌ కుమార్‌ కూడా స్పష్టం చేశాడు. 

 

200పైగా దేశాల నుంచి పదివేల మంది అథ్లెట్లు పాల్గొనే పక్షం రోజుల క్రీడా సంబురం ఒలింపిక్స్‌.. కరోనా ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కరోనా విజృంభించి.. జులై 24 నుంచి జపాన్‌ రాజధాని టోక్యోలో జరగాల్సిన 2020 మెగా ఈవెంట్‌ వాయిదా పడుతుందా లేక మొత్తానికే రద్దవుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: