2019 ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది టీడీపీ నేతలు చంద్రబాబుకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఓటమి పాలైన నేతలు టీడీపీలో ఉండటం కష్టమని భావించి బీజేపీ, వైసీపీల్లోకి జంప్ అయిపోయారు. అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బాబుకు షాక్ ఇచ్చారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. అయితే స్థానిక ఎన్నికల పోరు రానుండటంతో బాబు, ఇటీవలే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లని నియమించారు.

 

కానీ గన్నవరంలో మాత్రం ఇంకా ఎవరిని ఇన్‌చార్జ్‌గా పెట్టలేదు. ఇక్కడ నుంచి రెండోసారి గెలిచిన వల్లభనేని వంశీ గత ఏడాది టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. ఈ క్రమంలోనే గన్నవరం రేసులోకి పలువురు టీడీపీ నేతలు పేర్లు వచ్చాయి. చివరికి నియోజకవర్గం మీద పట్టున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధాకు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగింది.

 

కానీ తాజాగా బాబు వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఉండే ఈ నియోజకవర్గంలో ఓ బీసీ నేతకు అవకాశం ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అసలు ఈ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఎక్కువ శాతం కమ్మ ఎమ్మెల్యేలే గెలిచారు. అది కూడా టీడీపీ నుంచే. మరి అలాంటి కమ్మ డామినేషన్ ఉండే నియోజకవర్గంలో బాబు బీసీ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తూ, కృష్ణా జిల్లాలో కీలక నాయకుడుగా ఎదిగి, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న బచ్చుల అర్జునుడుకు ఇన్‌చార్జ్ పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.

 

బీసీ వర్గానికి చెందిన అర్జునుడు అయితేనే అటు కమ్మ, ఇటు బీసీలతో పాటు ఎస్సీ ఓటర్లని కూడా కలుపుకుని వెళ్లగలరని అనుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో కూడా ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందని టీడీపీ అధిష్టానం నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి బలమైన వల్లభనేని వంశీకి చెక్ పెట్టి గన్నవరంలో టీడీపీ పునర్వైభవం ఎలా సాధిస్తుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: