జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖపట్నంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రాష్ట్రాభివృద్ధి కోసమని మూడు రాజధానులు తీసుకొచ్చి, కీలకమైన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఇక విశాఖని రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి, అక్కడ రాజధానికి కావాల్సిన ఏర్పాటులని చేస్తున్నారు. ముఖ్యంగా నగర ప్రాంతంలో ప్రత్యేకమైన అభివృద్ధి చేయడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

 

అయితే ఈ విధంగా జగన్ నగరంపై ఫోకస్ పెట్టడానికి కారణాలు లేకపోలేదు. రాష్ట్రాన్నే ఆకర్షించే గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్‌(జీవీఎంసీ)ని కైవసం చేసుకోవాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకే నగరంపై మరింత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. పైగా నగరంలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకున్న టీడీపీ బలంగా ఉంది. ఆ విధంగా బలంగా ఉన్న టీడీపీకి చెక్ పెట్టేందుకు జగన్ ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తున్నారు.

 

ఈ క్రమంలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ దెబ్బకు టీడీపీ చాలావరకు వీక్ అయిపోయింది. చంద్రబాబు అమరావతికి జై అనడం వల్ల, విశాఖలో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఆ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో ఇటీవల విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన బాబుకు బాగా అర్ధమైంది. అయితే కేవలం ఈ నిర్ణయంతోనే టీడీపీ వీక్ అయిపోయిందనుకుని జీవీఎంసీ బరిలో దిగితే వైసీపీకి ఇబ్బందులే ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి ఎన్నికల ముందే విశాఖ నగరాన్ని వన్‌సైడ్‌గా వైసీపీకి అనుకూలంగా తీసుకురావాలని జగన్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నగరంలో బలంగా ఉన్న టీడీపీ నేతలని వైసీపీలోకి తీసుకురావాలని చూస్తున్నారు.

 

అదేవిధంగా మంచి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ కేడర్‌ని వైసీపీలోకి తీసుకోచ్చేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నగరానికి ఆనుకుని ఉన్న గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు మేయర్ పదవి ఆఫర్ ఇచ్చి వైసీపీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పదవి గ్యారెంటీ అనుకుంటే పల్లా కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికైతే విశాఖలో వార్ వన్‌సైడ్ చేసి జీవీఎంసీ పీఠంపై వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: