ఆడ‌బిడ్డ‌ల ర‌క్ష‌ణ ఎంత సున్నిత‌మైన అంశంగా మారుతుందో తెలియ‌జేసే అంశ‌మిది. గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు వెళితే ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని అంతా అనుకుంటుంటే... ఇంట్లో కూడా ర‌క్ష‌ణ ఉండ‌ని దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితి నెల‌కొంది. కుటుంబ స‌భ్యులే ఆడ‌బిడ్డ‌ల పాలిట శ‌త్రువులుగా మారుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌  గ్రామంలో నెల‌కొన్న‌ విషాద ఘ‌ట‌న నేప‌థ్యంలో ఈ అనుమానం మ‌రోమారు రుజువైంది. తాడ్కోల్‌ రాజారామ్‌ దుబ్బ చెరువులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు బయటపడ్డాయి. వీరిని చంపింది ఎవ‌రో కాదు సొంత తండ్రే.

 


బాన్సువాడ మండలం తాడ్కోల్‌ గ్రామానికి చెందిన నీలోఫర్‌, ఫయాజ్‌ దంపతులకు ఐదుగురు సంతానం. వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. నాల్గవ సంతానంలో ఇద్దరు కవలలు పుట్టారు. వీరిలో ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆడపిల్లను చిన్నపుడే దత్తత ఇచ్చారు. మద్యం, పేకాటకు  బానిస అయిన ఫయాజ్, ఆయ‌న చేష్ట‌ల ఆర్థిక సమస్యలతో ఇంట్లో నిత్యం గొడవలు ఆ గొడ‌వ‌ల విష‌యంలోనే తాజాగా దుర్మార్గానికి ఒడిగ‌ట్టాడు తండ్రి ఫ‌యాజ్‌.

 


కుటుంబాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం, ఐదుగురు పిల్ల‌లు ఉన్న‌ప్ప‌టికీ వారి చ‌దువు గురించి ప‌ట్టించుకోని ఫయాజ్ గురించి అతని భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అయితే, ఇక్క‌డే ఫ‌యాజ్ దుర్మార్గ ఆలోచ‌న బ‌య‌ట‌పడింది. భార్య‌ పోలీసులకు  ఫిర్యాదు చేసిందన్న విషయాన్ని మనసులో పెట్టుకున్న ఫయాజ్‌ మరుసటి రోజు ఉదయం పండుగ ఉందని చెప్పి నలుగురు పిల్లలను చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే, తండ్రి ప్రవర్తనపై భయపడ్డ కుమారుడు తప్పించుకొని ఇంటికి వచ్చాడు. ముగ్గురు ఆడపిల్లలు కనిపించకపోయేసరికి నీలోఫర్‌ వారికోసం గాలిస్తుండగా తడిసిన బట్టలతో ఫయాజ్‌ కనిపించాడు. అనుమానం వచ్చిన నీలోఫర్‌ చెరువు వద్దకు వెళ్లి చూసింది. అక్కడ పిల్లల చెప్పులు కనిపించడం, పిల్ల‌ల జాడ తెలియ‌క‌పోవ‌డంతో... ఆమె గ్రామస్తులకు త‌న ఆవేద‌న వెళ్ల‌బోసుకుంది. దీంతో స్పందించిని గ్రామ‌స్తులు చెరువులో వెతకగా అఫియా(10),  మహిమ్‌(9), జోయా(7)ల మృతదేహాలు దొరికాయి. అనంత‌రం స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. కాగా దుర్మార్గుడైన తండ్రి ఫ‌యాజ్ పోలీసుల అదుపులో ఉన్న‌ట్లు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: