ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేకెత్తిస్తున్న‌ చైనాలో పుట్టిన‌ కరోనా వైర‌స్ త‌న విజృంభ‌ణ‌ను కొన‌సాగిస్తోంది. ఈ వైరస్​ ప్రభావంతో ఇప్పటి వరకు చైనాలో 3వేలకు పైగా మృతి చెందిన ఆదేశ అధికారులు ప్రకటించారు. తాజాగా మరో 139 మంది వైరస్​ బారిన పడినట్లు ధ్రువీకరించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది హుబే ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. తాజాగా మరో 139 మందితో కలిపి కరోనా సోకిన వారి సంఖ్య 80 వేల 400కు చేరింది. అదే స‌మ‌యంలో క‌రోనా మ‌ర‌ణాలు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు వారు వివ‌రిస్తున్నారు. ఇదిలాఉండ‌గా, కరోనా భారత్‌ ను కలవర పెడుతోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరడం మనోళ్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. 

 

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండ‌టంతో భార‌త్ అల‌ర్ట్ అయింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న కేంద్రం.. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన నౌకలను పోర్టుల వద్దే నిలిపివేస్తోంది. దీంతో.. దేశంలోని 12 ప్రధాన పోర్టుల్లో 452 నౌకలు నిలిచిపోగా.. మొత్తం 16,076 మంది ప్రయాణికులు అందుల్లోనే చిక్కుకుపోయారు. ఇక కరోనా సోకిన 14 మంది ఇటాలియన్లను ఢిల్లీలోని ఐటీబీపీ క్వారెంటైన్‌ సెంటర్‌ నుంచి గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌లో 9 మంది ఇటలీ పర్యాటకులను పరీక్షల నిమిత్తం ఢిల్లీకి తరలిస్తున్నారు.

 


కాగా, క‌రోనా నేప‌థ్యంలో తొలిసారి ఆన్​లైన్​ మీడియా సమావేశం నిర్వహించిన చైనా డాక్టర్లు,  భారత వైద్య అధికారులకు సలహాలు అందించారు. వైరస్‌ను అరికట్టేందుకు భారత్​ తగినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. రోగులకు చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఇందులో తమను తాము కాపాడుకునేలా కూడా తర్ఫీదు ఇవ్వాలని పేర్కొన్నారు. కరోనాను అరికట్టేందుకు భారత ప్రజలకు మాస్కులు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవడంపై అవగాహన కల్పించాలని పేర్కొంటూ చైనా వైద్యులు పలు సూచనలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: