ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్ విష‌యంలో ఖాతాదారుల్లో, మ‌దుపరుల్లో ఆందోళ‌న పెరిగిపోతోంది. ఎస్ బ్యాంకు సంక్షోభంపై కేంద్రం స్పంద‌న‌, త‌క్ష‌ణ నిర్ణ‌యాల గురించి అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంతో కీల‌క నిర్ణ‌యాలు వెల్ల‌డించారు. ఎస్‌ బ్యాంకులోని ప్రతి ఖాతాదారుడి డబ్బు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి  భరోసా ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌తో మాట్లాడానని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ అంశంలో సత్వర పరిష్కారం కనుగొనే దిశగా ఆర్‌బీఐ కృషి చేస్తోందని వెల్లడించారు. అయితే, కేంద్రం నిర్ణ‌యంపై ఖాతాదారులు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.

 

 

ఎస్ బ్యాంక్ ఖాతాదారులు, బ్యాంకు, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొనే చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. ప్ర‌స్తుతం ఖాతాదారులు రూ. 50వేల వరకు తీసుకునేలా ఏర్పాట్లు చేయడమే తమ ముందున్న తొలి ప్రాధాన్యమని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఎస్ బ్యాంకు సంక్షోభంపై కేంద్రం 2017లోనే అప్రమత్తమైందని తెలిపారు. అప్పటి నుంచి బ్యాంకు పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. గత ఆరు నెలలుగా ప్రతి రోజు బ్యాంకు కార్యకలాపాలను పరిశీలనలో ఉంచామని అన్నారు. ముఖ్యంగా, ఎస్ బ్యాంకులో పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించామని.. ఇది వ్యవస్థాగతమైన సంక్షోభంగానే భావిస్తున్నామని చెప్పారు.  ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి పనిచేస్తాయని వెల్లడించారు.ఎస్‌ బ్యాంకులోని ప్రతి ఖాతాదారుడి డబ్బు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

 

ఎస్ బ్యాంకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో… శోధించాలని ఆర్బీఐని కోరుతున్నట్టు నిర్మ‌లా సీతారామ‌న్‌ వెల్లడించారు. సంక్షోభానికి మొదలు, ముగింపు ఏమిటన్నది కూడా ఆర్బీఐ నుంచి నివేదిక తీసుకుంటామని తెలిపారు. ఎస్ బ్యాంక్ పరిస్థితికి కారణాలు ఏమిటన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎస్ బ్యాంకును సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని…అందుకే ఎస్బీఐ 49 శాతం పెట్టుబడులు పెట్టనుందని నిర్మ‌లా సీతారామ‌న్‌ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: