భారత దేశంలో ఎన్నికలు అంటే ఓ పండుగ.. నిజంగానే ఇండియా వంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను మించిన పండుగ ఏముంటుంది.. అందుకే ఎన్నికల కోసం జనం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే.. ఎన్నికల సమయంలోనే కాస్త నాయకులు ప్రజలను పట్టించుకుంటారు. ఐదేళ్ల పాటు జనం ఉన్నారా చచ్చారా అన్నది ఏమాత్రం పట్టించుకోని నాయకులు ఎన్నికల ముందు మాత్రం జనం చుట్టూ తేనె కోసం తిరిగే తేనెటీగల్లా తిరుగుతారు.

 

 

అయితే మనం ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నా... మన ఎన్నికల వ్యవహారం అంతా ఓ మాయ.. లక్షలు, కోట్లలో ఖర్చు చేసే స్థోమత లేనివాళ్లు అసలు ఎన్నికల్లో పాల్గొనే ఆలోచనే చేసే పరిస్థితి లేదు. ఎన్నికల్లో నిలబడితే.. నామినేషన్ వేసే రోజులు నుంచి పోలింగ్ బూతులో ఓట్లు పడేంత వరకూ అభ్యర్థులు డబ్బు ధారాళంగా ఖర్చు చేస్తారు. అలా చేస్తే తప్ప విజయం పై ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు.

 

 

ఒక్క ప్రజా సేవ మాత్రమే చేస్తే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు పంచాలి. మందు పోయించాలి. ప్రచార ఆర్భాటం చేయాలి. సెలబ్రెటీలను సభలకు రప్పించాలి. ఇంత చేసినా మళ్లీ పోలింగ్ కు ముందు రోజు ఓటుకింత అని డబ్బు పంచాలి. ఇంత చేసినా గెలుపై గ్యారంటీ మాత్రం ఉండదు. మరి అలాంటిది ఏపీ సీఎం జగన్ మాత్రం స్థానిక ఎన్నికల్లో సాహసమే చేస్తున్నాడు.

 

 

స్థానిక సంస్థల ఎన్నికల కోసం జగన్ కొత్త చట్టం తెచ్చాడు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచుతూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అంతే కాదు ఆ అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుంది. బహుశా ఇలాంటి చట్టం దేశంలో ఇదే కావచ్చు. ఇప్పుడు ఈ చట్టాన్ని చూసి చాలా మంది నాయకులు జగన్ ను తిట్టుకుంటున్నారు. వామ్మో ఏంటీ కొత్త చట్టం.. ఇలాంటిది దేశంలో ఎక్కడైనా ఉందా..? అంటూ కంగారుపడుతున్నారు. జగన్ మాత్రం ప్రజలకు నమ్మకం ఉంటే.. డబ్బు, మద్యం పంచకపోయినా గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో..

 

మరింత సమాచారం తెలుసుకోండి: