ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మీడియాపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మండిపడుతోంది. పార్టీ కి చెందిన ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై అసత్య కథనం ప్రసారం చేయడమే అందుకు కారణం. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ కథనం ఇచ్చింది. జీవీఎల్ పై నడ్డా మండిపడ్డారన్నది ఆ కథనం సారాంశం.

 

 

జీవీఎల్ నరసింహారావు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని.. ఈ విషయంపై పలువురు రాష్ట్ర నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారని ఆ కథనంలో ఉంది. అందుకే నడ్డా ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని ఢిల్లీలోని తన నివాసానికి పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా మీడియాలో మాట్లాడుతూ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరుస్తున్నారని నడ్డా జీవీఎల్ పై మండిపడ్డారని ఆ కథనంలో ఉంది.

 

 

ఈ మేరకు తమకు సమాచారం ఉందని ఆ మీడియా తెలిపింది. అయితే ఈ కథనం పై జీవీఎల్ తరుపున ఆంధ్ర బీజేపీ అధికారంగానే స్పందించింది. చాల ఘాటుగానే ఏబీఎన్ కి షాక్ ఇచ్చింది. ఏబీఎన్‌ ఛానల్ అసత్య కథనాలపై బీజేపీ ఖండన ఎలా ఉందంటే... " బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారిపై పూర్తిగా అసత్యాలతో కూడిన కథనం ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము. బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు జీవిఎల్ నరసింహారావు గారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని అవాస్తవ కథనం పై కచ్చితంగా ఆ ఛానల్ క్షమాపణ చెప్పాలి అని తెలియచేస్తున్నాము.

 

 

పత్రికా, మీడియా విలువలు మరచి తరచూ బీజేపీ పై అసత్య కథనాలు ప్రసారం చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి తమ వైఖరిని మార్చుకోకపోతే ఛానల్ చర్చలను బహిష్కరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియచేస్తున్నాము.. అంటూ స్పందించింది. అయితే ఏపీ బీజేపీలోని కోల్డ్ వార్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు అంటున్నారు. ఏబీఎన్ లో కథనం వెనుక సుజనా చౌదరి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: