ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ లో ఎవరికీ వారే యమునా తీరే ... అన్న చందంగా పరిస్థితి తయారయింది .   రాజధాని అమరావతి తరలింపు అంశంపై పార్టీ నేతలు తలొక స్టాండ్ తీసుకోవడం వల్ల పార్టీ నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం స్పష్టమయింది . ఇది చాలదన్నట్లు పార్టీ నేతలు పరోక్షంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం హాట్ టాఫిక్ గా మారింది .   రాజధాని తరలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , రాజ్యసభ సుజనా చౌదరి లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు .

 

అయితే రాజధాని తరలింపు అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని , అందులో కేంద్రం జోక్యం ఉండదని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్సింహారావు పలుమార్లు చెప్పుకొచ్చారు . అయితే ఇక్కడే జివిఎల్ , అధికార పార్టీకి తొత్తుగా మారారని, దానికి  ఆయనకు  భారీగానే ప్రతిఫలం ముట్టిందన్న వార్తాకథనాలు వెలువడ్డాయి . అయితే ఈ కథనాల వెనుక తమ పార్టీ నేతలే ఉన్నారంటూ జివిఎల్ పరోక్షంగా కన్నా , సుజనా చౌదరిలపై మండిపడ్డారు . తాను మాట్లాడేది పార్టీ స్టాండ్ అంటూ , ప్రభుత్వమే ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు . పనిలో పనిగా తనపై అసత్య కథనాలు రాశారంటూ , కొన్ని పత్రికలపైన  మండిపడ్డ జివిఎల్ , తనకు క్షమాపణలు చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ హెచ్చరించాడు .

 

జివిఎల్ చేసిన విమర్శలపై కన్నా , చౌదరి ఎలా స్పందిస్తారన్నదిప్పుడు హాట్ టాఫిక్ గా మారింది . గతం లో జివిఎల్ చేసిన వ్యాఖ్యలపై సుజనా చౌదరి ఘాటుగానే స్పందించిన విషయం తెల్సిందే . రాజధాని అంశం లో కేంద్రం జోక్యం చేసుకోదన్న జివిఎల్ వ్యాఖ్యలపై ఏ ఎల్లయ్యో ...పుల్లయ్యో చెబితే కాదంటూ ఎద్దేవా చేశారు . మరి ఇప్పుడు ఎటువంటి సెటైర్లు వేస్తారో చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: