పుట్టెడు కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకోవడం అటుంచి అసలు ఉనికిలో ఉంటుందనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమయ్యే పరిస్థితికి వచ్చింది. ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి కూడా ఆ విధంగానే ఉంటోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మొదటి నుంచి ఇలాగే ఉంటూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వంపై ఆయన అసంతృప్తిగానే ఉంటున్నారు. ఎన్నికలకు ముందు ఒకసారి ఆ తరువాత ఒకసారి రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు అదే రకమైన అసంతృప్తితో ఉన్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా వేరే ఏదైనా పార్టీలో చేరతారా లేక కొత్తగా ఆయన ఒక పార్టీ స్థాపిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. 

IHG


పీసీసీ అధ్యక్ష పదవి ఉద్దేశించి ఆయన తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో, సరైన నాయకత్వం లేకపోవడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుని, సరైన నాయకత్వాన్ని అందిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ ను గద్దె దించడమే ఏకైక లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీతో కలిసి ముందుకు సాగుతానని, లేకపోతే బీజేపీతో కలిసి పోరాడుతాను అంటూ చెప్పుకొచ్చారు. 


లేకపోతే సొంతంగా పార్టీ పెట్టి టిఆర్ఎస్ తో పోరాటం చేస్తానని రాజగోపాల్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం పిసిసి అధ్యక్ష పదవి విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించడమే కారణంగా తెలుస్తోంది. తనకు నచ్చిన వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే, తాను పార్టీలో ఉంటాను అన్న విధంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు గా అర్థం అవుతోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: