తెలంగాణలో లెక్క పద్దులు సమయం వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 8వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈసారి ఆర్థిక మంత్రి హోదాలో మంత్రి హరీశ్ రావు తొలిసారిగా బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఇదే బడ్జెట్ ను శాసన మండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశ పెడతారు.

 

 

అయితే కీలకమైన సమయంలో హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. బడ్జెట్ అంటేనే అంకెల గారడి.. కేటాయింపులు ఘనంగా చూపించి బడ్జెట్ స్వరూపాన్ని అమాంతం పెంచి.. ఘనంగా చెప్పుకోవచ్చు.. కానీ గత ఏడాది కేటాయింపులకు ఎంత ఖర్చు చేసిందీ చెప్పేటప్పుడు మాత్రం అసలు డొల్లతనం బయటపడుతుంది.

 

 

అందుకే కేసీఆర్ గత బడ్జెట్ సమయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా అంతకుముందు ఏడాది కంటే తక్కువ కోట్ల పరిమాణంతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఓవైపు ఆర్థిక మాంద్యం కారణంగా.. మరోవైపు జీఎస్టీ అమలు కారణంగా తెలంగాణ బడ్జెట్ లో కోత కనిపిస్తోంది. ఆదాయాలు తగ్గిపోయాయని సాక్షాత్తూ కేసీఆరే స్వయంగా అంగీకరించారు. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పరిమాణం కుదించారు.

 

 

మరి ఈ ఏడాది ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి. ఆర్థిక మాంద్యం పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో ఈ ఏడాది కూడా బడ్జెట్ అంత ఘనంగా ఉండే అవకాశం కనిపించడంలేదు. అసలే సాగు నీటి రంగానికి కేటాయింపులు ఎక్కువ చేయాలి. మరోవైపు భారీ సంక్షేమ పథకాలు.. మరి వీటన్నింటినీ సమన్వయం చేస్తూ హరీశ్ రావు ఎలాంటి మాయ చేస్తారన్నది వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: