టెక్నాలజీ పెరిగిపోయింది.. ఇప్పుడు సకల సమస్యలకూ టెక్నాలజీతో పరిష్కారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల అక్రమాలకు కూడా దీంతో చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ సర్కారు అలాంటి ఓ ప్రయోగం చేయబోతోంది. మరి అది ఎంత వరకూ విజయవంతం అవుతుందో చూడాలి.

 

 

ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచడం ఇండియాలో సర్వసాధారణంగా మారింది. అయితే ఈ సంస్కృతికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అధికారులు ఓ ప్రత్యేక యాప్ ను తయారు చేశారు. ఈ యాప్ ఎలా పని చేస్తుందంటారా... మీ కళ్ల ముందు ఏమైనా ఎన్నికల అక్రమాలు .. ప్రత్యేకంగా డబ్బు, మద్యం పంపిణీ అవుతుంటే.. ఇంకా ఏదైనా అక్రమాలు మీ దృష్టికి వస్తే.. మీ మొబైల్‌ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని... దాన్ని రికార్డు చేసి వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు.

 

 

ఈ యాప్ పేరు నిఘా.. దాన్ని పంచాయతీరాజ్‌ శాఖ రూపొందించింది. ఎన్నికల్లో అక్రమాలపట్ల జగన్ సర్కారు చాలా సీరియస్ గా ఉంది. ఎన్నికల నియమావళిని అతిక్రమించి అభ్యర్థులు ఓటర్లను బెదిరింపులు లేదా ప్రలోభాలకు గురిచేసినట్లు రుజువైతే అటువంటి వ్యక్తులు గెలిచినప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగటానికి వారిని అనర్హులుగా పరిగణించడంతో పాటు ఆరేళ్లపాటు తిరిగి పోటీచేయకుండా ఉండేలా జగన్ ప్రభుత్వం ఇటీవల చట్టం తీసుకొచ్చింది కూడా.

 

 

అంతేకాదు.. అలాంటి వారికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. రూ.పదివేల వరకు జరిమానా విధిస్తారు. ఇకపై వారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోతారు. మరి ఈ కొత్త యాప్ ఎంతవరకూ పనిచేస్తుందో.. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి ఎన్నికలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: