స్ధానిక సంస్ధల ఎన్నికల వేడి పెరిగిపోతున్న నేపధ్యంలో తెలుగుదేశంపార్టీ  నేతలను ఓ ప్రధాన సమస్య వెంటాడుతోంది. దీనిపై నేతల మధ్య చర్చలు కూడా మొదలైపోయాయి. ఇంతకీ ఆ ప్రధాన సమస్యేంటో తెలుసా ? అదేనండి నిధుల సమస్యేనట. ఈనెలంతా వరసబెట్టి ఎన్నికలే ఎన్నికలు. సర్పంచ్ ఎన్నిక మొదలుకొని ఎంపిటిసి, జడ్పిటిసి తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగిపోతాయి. ఇన్ని ఎన్నికల్లో  పోటి చేయాలంటే నేతల దగ్గర బాగా డబ్బుడాలన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇపుడు టిడిపికి నిధుల సమస్యే ప్రధాన అడ్డంకిగా మారినట్లు సమాచారం. ఇదే విషయాన్ని కొందరు సీనియర్ నేతల దగ్గర చంద్రబాబునాయుడు ప్రస్తావించినట్లు తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నీ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్ధులు నిధుల వరద పారించారు. అయినా ఉపయోగం లేకుండా తల బొప్పి కట్టేసింది. దానికి తోడు కీలకమైన నేతల్లో కొందరు టిడిపిని వదిలిపెట్టి బిజెపిలో చేరిపోయారు. ఇంకొందరు నేతలు వైసిపిలో చేరారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీలోనే ఉన్న చాలామంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు స్వయంగా జిల్లాల టూర్లకు వెళుతున్నా సీనియర్లు పట్టించుకోవటం లేదు. ఈ పరిస్ధితుల్లో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి అంటే చాలామంది నేతలు ముందుకు రావటం లేదు. పైగా ఎవరైనా గెలిచినా టిడిపిలోనే ఉంటారనే గ్యారెంటీ కూడా లేదు. ఇందుకనే పోటి చేసే అభ్యర్ధుల కోసం పార్టీ తరపున ఖర్చు పెట్టడం దండగనే చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం.  

 

ఈ పరిస్ధితుల్లో సొంతంగా ఖర్చులు పెట్టుకుని పార్టీ తరపున లైఫ్ అండ్ డెత్ గా తీసుకుని ఎంతమంది నేతలు ప్రిస్టేజ్ గా పోటిలోకి దిగుతారన్నదే పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే చంద్రబాబు హయాంలో వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిలను ఎంత ఒత్తిడి పెట్టి టిడిపిలోకి లాక్కున్నారన్న విషయం అందరూ చూసిందే. అలాగే లోకల్ బాడీల్లో గెలిచిన వారిని కూడా లాగేసుకున్నారు. ఇదే వ్యవహారం వైసిపి తరపున జరగదనే గ్యారెంటీ కూడా లేదని టిడిపిలో చర్చ జరుగుతోంది. సరే ఏదెలాగున్నా టిడిపి పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యకు పరిష్కారమేంటో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: