కరోనా వైరస్... ఈ పేరు వినపడితే చాలు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 3,400కు చేరింది. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 31కు చేరింది. కరోనా దేశంలో వ్యాప్తి చెందకుండా కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. బయోమెట్రిక్ విధానం ద్వారా కరోనా వ్యాపిస్తోందని వార్తలు వైరల్ కావడంతో కేంద్రం తాత్కాలికంగా ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుండి మినహాయింపు ఇచ్చింది. 
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాతకాలం నాటి రిజిష్టర్ విధానంలో సంతకం చేసి విధులకు హాజరు కావాలని కేంద్రం సూచించింది. ఈ నెల చివరి వరకు ఆధార్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ఉపయోగించాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. అన్ని మంత్రిత్వ శాఖలు బయోమెట్రిక్ ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఉద్యోగులకు బయో మెట్రిక్ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాయి. 
 
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపట్టాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా గురించి సమీక్షా సమావేశాలు నిర్వహించి వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ వైరస్ ప్రభావంతో మెట్రో రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. 
 
నగరాల్లోని కొందరు యువతీయువకులు కరోనాకు భయపడి సొంతూళ్లకు వెళుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఏపీలో 27 మంది కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా 20 మందికి కరోనా నెగిటివ్ అని తేలింది. మిగతా ఏడుగురికి సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది.              

మరింత సమాచారం తెలుసుకోండి: