దేశంలో కరోనా కేసుల సంఖ్య 31కి చేరింది. థాయిలాండ్‌, మలేసియాలో పర్యటించి వచ్చిన ఢిల్లీ వ్యక్తికి కరోనా సోకినట్లు... వైద్యపరీక్షలో నిర్ధారణ అయింది. కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూ ఉండటంతో... వైరస్‌ వ్యాపించకుండా కేంద్రం పటిష్ట చర్యలు చేపడుతోంది.

 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్... భారత్‌లోనూ కలవరాన్ని పెంచుతోంది. తాజాగా ఢిల్లీలో మరో కేసు నమోదు కావడంతో... కరోనా కేసుల సంఖ్య 31కి చేరింది. ఢిల్లీకి చెందిన వ్యక్తి... ఇటీవలే థాయిలాండ్, మలేసియాలో పర్యటించి వచ్చాడు. అస్వస్థతతో ఆసుపత్రికి వచ్చిన ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా నిర్ధారణ అయింది. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  

 

కొన్ని రాష్ట్రాల్లో కరోనా అనుమానితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కాన్పూర్ లో ముగ్గురు వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరడంతో... వారి నుంచి శాంపిల్స్‌ తీసుకుని వైద్య పరీక్షల కోసం పంపారు. వీరిలో ఇద్దరు బ్రెజిల్‌ వెళ్లి థాయిలాండ్‌, సింగపూర్‌ మీదుగా ఇండియా వచ్చారు. ఇక యూపీకి చెందిన 12 మంది ఇటీవల వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న ఇటలీ, ఇరాన్‌, థాయిలాండ్‌, జపాన్‌, సింగపూర్‌ దేశాలకు వెళ్లివచ్చినా... ట్రావెల్‌ హిస్టరీని బయటపెట్టకపోవడంతో... వారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వాళ్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

 

మరోవైపు, గత నెలలో ఇరాన్‌ నుంచి ఇండియాకు వచ్చిన 450 మంది టూరిస్టులు దేశంలో ఎక్కడ ఉన్నారో తెలీక పోవడంతో... వారి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉంది. పర్యాటక శాఖ. ఇరాన్‌లోనూ భారీగా కరోనా కేసులు నమోదు కావడం, 124 మంది ప్రాణాలు కోల్పోవడంతో... 450 మంది పర్యాటకులూ ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కొని, వైద్య పరీక్షలు చేయించాలని ప్రయత్నిస్తోంది. విదేశీ పర్యాటకుల ద్వారా దేశంలోకి కరోనా రాకుండా... అంతర్జాతీయ విమానాల ద్వారా ఇండియాలో దిగుతున్న ప్రతి ఒక్క ప్రయాణికుడికీ ఏర్‌పోర్ట్‌లోనే వైద్య పరీక్షలు చేయించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. 


ఒడిషాలోని కటక్‌లో... ఓ ఐర్లాండ్‌ దేశస్థుడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో... అతడిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఫలితాలు రాకముందే అతను ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడంతో... గాలించి పట్టుకుని ఆస్పత్రికి తీసుకొచ్చి... ప్రత్యేక గదిలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.

 

కరోనా భయంతో దేశంలో చాలా మంది ప్రజలు మాస్క్‌ల కోసం ఆస్పత్రులు, మెడికల్‌ షాపులకు క్యూ కడుతుండటంతో... వాటి కోసం డిమాండ్‌ భారీగా పెరిగిపోయి నిల్వలన్నీ అయిపోతున్నాయి. అయితే కొందరు కావాలనే మాస్క్‌ల సరఫరాకు ఆటంకం కలిగించి... వాటిని బ్లాక్‌మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో... మాస్క్‌ల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ఇక, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనూ కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని... ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ లేఖలు రాశారు. వైరస్‌ వ్యాపించకుండా చూడాలని, ప్రజారోగ్యం విషయంలో రాజీపడొద్దని ఆదేశించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: