కాసుల కోసం కక్కుర్తి పడ్డ హాస్పిటల్ నిర్వహకులు పురుడు పోసుకున్న గంటల వ్యవధిలోనే శిశువును తల్లి ఒడికి దూరం చేశారు. మొదట అమ్ముకానికి సిద్ధపడ్డ తండ్రి మనస్సు మార్చుకోవడంతో, వరంగల్ జిల్లాలో ఆడశిశువు అక్రమ అమ్మకం బండారం అంతా బయట పడింది. 

 

వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలో ఆడశిశువు అక్రమ అమ్మకం వెలుగు చూసింది. పుట్టిన ఆడ బిడ్డని వదిలిం చు కోవాలన్న కసాయి తండ్రి ఆలోచనలను ఆసరా చేసుకుంది ఓ ప్రైవేట్ ఆస్పత్రి.. కాసుల కోసం కక్కుర్తి పడ్డ హాస్పిటల్ నిర్వాహకులు లక్ష రూపాయలకు ఆడశిశువును అమ్మేశారు.

 

వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని బొల్లికొండ నంద్యాతండాకు చెందిన మాలోతు సుశీల, కిందటి నెల 7న స్థానిక పార్థూ నర్సింగ్‌ హోంకు ప్రసవం కోసం వచ్చింది. మొదటి కాన్పులో ఆడబిడ్డ పుట్టగా రెండో కాన్పులో కూడా ఆడశిశువుకు జన్మనివ్వడంతో బిడ్డను వద్దనుకున్నారు. పుట్టిన ఆడ శిశువును వదిలించు కోవాలనుకున్నాడు తండ్రి ప్రశాంత్. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆసుపత్రి నర్సు పద్మ, తిరుపతిరెడ్డి అనే వ్యక్తికి సమాచారాన్ని చేరవేసింది. హన్మకొండలో పిల్లలు లేని విజయ్‌కుమార్‌-రజని దంపతులకు బిడ్డను బేరానికి పెట్టాడు తిరుపతిరెడ్డి. దీంతో విజయ్‌కుమార్‌ దంపతులు ఆసుపత్రి సిబ్బందికి లక్ష రూపాయలు ఇచ్చి  బిడ్డను తీసుకెళ్లారు. 


 
ఆసుపత్రి సిబ్బంది మాత్రం బిడ్డ తండ్రికి కేవలం 20 వేలు మాత్రమే ఇచ్చారు. మొదట పాపను అమ్మేందుకు ఒప్పుకున్న తండ్రి, తన బిడ్డ తనకు తిరిగి ఇచ్చేయాలంటూ గత నెల 17న ఆసుపత్రిని సంప్రదించారు. అయితే పుట్టింది మగశిశువని.. పుట్టగానే చనిపోయాడంటూ తండ్రిని తప్పు దారి పట్టించారు ఆస్పత్రి సిబ్బంది. కానీ చనిపోయిన తన బిడ్డ ఎక్కడ అంటూ నిలదీయడంతో ,వివాదం కాస్త అధికారుల వద్దకు చేరింది. దీంతో రంగం లోకి దిగిన శిశుసంక్షేమ అధికారులు అక్రమ దత్తత అంటూ మొదట గుర్తించారు.

 

బాలల సంరక్షణ కమిటీ సభ్యులు నంద్యాతండాలో విచారణ చేపట్టగా పుట్టింది ఆడబిడ్డనే అని తేలడంతో అక్రమ అమ్మకం జరిగినట్లు నిర్ధారించుకొన్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో గత నెల 25న ఐసీడీఎస్‌ అధికారి రాధిక ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు జువైనల్‌ యాక్టు కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

పోలీసులు బుధవారం రాత్రి పార్థు, తిరుపతిలను నెక్కొండ రైల్వేస్టేషన్‌లో విచారించగా పాప విజయ్‌కుమార్‌-రజని దంపతుల వద్ద ఉందని తెలిపారు. వెంటనే హన్మకొండలో రజనీ దంపతుల నుంచి బిడ్డను తీసుకొని బాలల సంరక్షణ కమిటీ సభ్యులకు గురువారం వేకువజామున స్థానిక ఎస్సై నాగరాజు అప్పగించారు.ఈ కేసులో ఆసుపత్రి సిబ్బందితో పాటు తిరుపతిరెడ్డి, రమాదేవి, ప్రశాంత్‌, నర్సమ్మ, విజయ్‌కుమార్‌, రజని మొత్తం పది మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో పార్థు, పద్మ, విజయ్‌కుమార్‌, రజని, తిరుపతిరెడ్డిలను అరెస్టు చేయగా.. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. 

 

విషయం తెలుసుకున్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు శోభారాణి అక్కడకు చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అనంతరం బిడ్డ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పాప తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక హామీ తీసుకొని పాపను అందజేశారు. అనంతరం వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: