ఈ మధ్య ఇలాంటి వరుస సంఘటనలు ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర అలజడులు సృష్టిస్తున్నాయి. విశాఖపట్నం, జీవీఎంసీ 6వ జోన్ కార్యాలంలో జరిగిన ఈ సంఘటన అందరిని నివ్వెర పోయేలా చేస్తోంది. ప్రభుత్వ మహిళా అధికారిపై తన తోటి సహ ఉద్యోగి పెట్రోల్ దాడి ప్రయత్నం పెను సంచలనం రేపింది. ఏఎంహెచ్‌వో లక్ష్మీ తులసిపై, పెట్రోల్ పోసేందుకు అన్నామణి అనే మరో ఉద్యోగి ప్రయత్నం చేసింది. వివరాలిలా వున్నాయి... 

 

జీవీఎంసీ కార్యాలయానికి వచ్చిన అన్నామణి, నేరుగా లక్ష్మీ తులసి దగ్గరకు వెళ్లి, ఆమెతో మంచిగా  మాట్లాడుతున్నట్లు నటిస్తూ, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ చల్లేందుకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి సహ సిబ్బంది, తులసిని పక్కకు లాగి, పెచ్చుమీరిపోతున్న అన్నామణిని గట్టిగా ఒడిసి పట్టుకున్నారు. ఇంకా, ఆమె చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను లాక్కుని పక్కకు విసిరేసారు. 

 

వెంటనే సదరు టీమ్ మెంబర్స్ డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చారు. పెట్రోల్ పోసేందుకు ప్రయత్నించిన అన్నామణిని అదుపులోకి తీసుకుని, ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇంకా ఇతరత్రా  కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే అన్నామణి గోపాలపట్నం పరిధిలో శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల అవసర నిమిత్తం ఆమె కొన్ని రోజులు సెలవులు తీసుకుంది. 

 

అయితే సదరు ఉద్యేగి, ఈమె పై అధికారిని అయిన తులసి ఈమె సెలవులకు జీతం కట్ చేసినందుకే, ఈ దాడి చేశారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇంకా నిజానిజాలు తేల వలసి వుంది. ఇక ప్రభుత్వ కార్యాలయంలో పెట్రోల్‌ దాడి మరోసారి కలకలంరేపింది. ఇటీవల హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌లో సరిగ్గా ఇలాంటి సంఘటన జరగడం గమనార్హం. తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణం వదిలారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస హత్యా దాడులు ప్రస్తుతం పెను దుమారాన్నే రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: