అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..గత పది నెలలుగా ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన గంటా...చాలాసార్లు పార్టీ మారిపోతారని వార్తలు వచ్చాయి. ఇదిగో బీజేపీలోకి వెళ్లిపోతున్నారు...అదిగో వైసీపీలో జంప్ అవుతున్నారంటూ ఆయనపై ప్రచారం నడిచింది. పైగా ఆ వార్తలకు తగ్గట్టుగానే ఆయన టీడీపీలో ఉన్నామా..లేమా అన్నట్లుగానే నడుచుకున్నారు.

 

ముఖ్యంగా జగన్ ప్రభుత్వం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడాన్ని సమర్ధించి బాబుకు షాక్ ఇచ్చారు. అలా అని టీడీపీని వీడలేదు. పార్టీలో ఉంటూనే ఇటీవల కొంతమంది బీజేపీ కార్యకర్తలని టీడీపీలోకి తీసుకొచ్చారు. సరే పార్టీలో మళ్ళీ యాక్టివ్ అయిపోయారనే లోపే, విశాఖలో బాబుని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నప్పుడు కనబడలేదు. దీంతో అంతా గంటా మాములోడు కాదు అనుకున్నారు. బాబు కోసం వెళితే విశాఖ ప్రజల్లో తనపై నెగిటివ్ వస్తుందనే భయంతో అక్కడికి వెళ్లలేదని అర్ధం చేసుకున్నారు.

 

అయితే అప్పటి నుంచి కనబడని గంటా...తాజాగా తన నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర చేస్తూ… ప్రత్యక్షమయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, గ్రేటర్ విశాఖపై టీడీపీ జెండా ఎగురవేస్తామని స్ట్రాంగ్‌గా చెప్పారు. తాము నగరంలో నాలుగు సీట్లు గెలిచామని, తమ సత్తా ఏంటో చూపిస్తామని అంటున్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్ విశాఖలో టీడీపీని గెలిపించేందుకు అక్కడున్న నలుగురు ఎమ్మెల్యేలు, పార్లమెంట్ స్థానంలో ఓడిపోయిన భరత్‌లు గట్టిగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

 

ఈ క్రమంలోనే ఉత్తర ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఇప్పటికే బీజేపీ కార్యకర్తలని టీడీపీలో చేర్చుకున్నారు. అలాగే విశాఖలో కాస్త బలంగానే ఉన్న జనసేనపై కూడా గంటా ఫోకస్ చేసినట్లు సమాచారం. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానంలో జనసేనకు దాదాపు 3 లక్షల వరకు ఓట్లు వచ్చాయి. కాకపోతే అభ్యర్ధి జేడీ లక్ష్మినారాయణ కావడం వల్ల కొందరు టీడీపీ వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ చేయడం వల్ల, ఆయనకు అన్ని ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడు లక్ష్మినారాయణ జనసేన వదిలేశారు.

 

అటు బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేసిన, పెద్దగా ఉపయోగడం ఉండదు. దీంతో తనకు పరిచయం ఉన్న చోటా, మోటా జనసేన నేతలని టీడీపీకి మద్ధతు తెలిపేలా గంటా ప్లాన్ చేస్తున్నారట. అలా జనసేన కార్యకర్తలు టీడీపీకి మద్ధతు తెలిపితే జీవీఎంసీ పీఠాన్ని గెలుచుకోవచ్చని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా గంటాతో చాలా కష్టం...ఆయన రాజకీయ వ్యూహాలు ఎవరికి అర్ధమయ్యేలా లేవులే.

మరింత సమాచారం తెలుసుకోండి: