అందరికంటే తాను ఓ మెట్టు ఎప్పుడు పైనే ఉండాలని చూస్తుంటారు టిడిపి అధినేత చంద్రబాబు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందినా, ఏపీ సీఎంగా జగన్ ను తాను అంగీకరించేది లేదు అన్నట్టుగా బాబు వ్యవహారశైలి ఉంటూ వస్తోంది. అసలు తాను తప్ప ఏపీని ఎవరు అభివృద్ధి చేయలేరని, జగన్ కు అనుభవమే లేదని, 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో జగన్ అంత మొండి వాడిని తాను చూడలేదని ఇలా ఏవేవో చెబుతూ... అందరికంటే తానే గొప్ప వ్యక్తిని, మంచి ముఖ్యమంత్రిని అని చెప్పుకునేందుకు తరచుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదంతా రొటీన్ వ్యవహారమే.

 

ఇక ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి అధికార పార్టీలో కనిపిస్తుండగా, టిడిపిలో మాత్రం ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు నిర్వహించే ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉండడంతో బాబుకు మరోసారి బెంగ  పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా చూడాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయించారు. ఈ అంశం తేలేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

 

IHG

ఏపీ అధికార పార్టీ వైసీపీ అయితే ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచినట్టు తేలితే సంబంధిత అభ్యర్థిని జైలుకి పంపించడంతో పాటు, అనర్హత వేటు వేసే విధంగా నిబంధనలు అమల్లోకి తీసుకు వచ్చింది. దీంతో జగన్ తీసుకొచ్చిన ఆ అస్త్రాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టిడిపి చూస్తోంది. ఒక వైపు జగన్ మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఎన్నికల్లో జరిగే అక్రమాలను ఫిర్యాదు చేయాలని, ఇప్పటికే ప్రకటించడంతో టిడిపి ఆలోచనలో పడింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కనుక అక్రమాలకు పాల్పడితే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టింది. అధికార పార్టీ పై ఫిర్యాదు చేసినా పోలీసులు పెద్దగా పట్టించుకోరని టిడిపి భావిస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అడ్డుకోవాలని, ఫోటోలు, వీడియోలు తీసి పంపాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు.

 

దీనికోసం ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అలా వచ్చిన సమాచారాన్ని మీడియాకు, అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎక్కడికక్కడ వైసీపీ దాడులను, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అయితే చంద్రబాబు పిలుపుకు స్పందన ఎలా ఉంటుంది అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే అసలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిడిపి తరఫున అభ్యర్థులు వెనుకడుగు వేస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు వల్ల కొత్తగా ఒరిగేది ఏమైనా ఉంటుందా అంటూ టిడిపి నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: