ప‌రోకారార్థ మిదం శ‌రీరం- అన్న‌ది ఆర్యోక్తి! అయితే, నేటి స‌మాజంలో అందునా.. ఈ స్పీడు యుగంలో ప‌క్క‌వారిని ప‌ట్టించుకునే తీరిక ఎక్క‌డుంది ? అంతెందుకు సొంత అమ్మానాన్న‌కే ఏదైనా స‌మ‌స్య ఉంటే.. ప‌ట్టించుకోని ప్రబుద్ధులు అనేక మంది ఈ స‌మాజంలో ఉన్నార‌నే విష‌యాన్ని ప్ర‌తి రోజూ మ‌నం ఏదో ఒక రూపంలో ప‌త్రిక‌ల్లో చ‌దువుతున్న‌దే.. పెద‌వి విరుస్తున్న‌దే! మ‌రి అంద‌రూ ఇలానే ఉంటారా ?  అంద‌రూ త‌మ స‌మ‌స్య‌కు త‌మ‌దైన ప‌రిష్కారం చేసుకుని, ప‌క్క‌వారు కూడా అదే స‌మ‌స్య‌తో అల్లాడుతున్నా.. మ‌న‌కెందుకులే అని త‌ప్పించేసుకుంటారా? అంటే.. శ్రీజారెడ్డి స‌రిప‌ల్లిని చూస్తే.. మాత్రం అలా అన‌లేం..!  


మ‌ద‌ర్ థెరిస్సాకు ప్ర‌తిరూపంగా ఈ ప్ర‌పంచంలో ఎంద‌రు ఉన్నారో! అని త‌ర‌చుగా అనేక మంది అంటూ ఉంటారు. అలాంటి మ‌ద‌ర్ థెరిస్సా బాట‌లో ఫాలో అయ్యేవారు ఇప్ప‌ట‌కీ మ‌న‌కు అరుదుగా క‌నిపిస్తుంటారు. ఇలాంటి వాళ్ల‌లో శ్రీజా రెడ్డి ఖ‌చ్చితంగా ఉంటారు.  శ్రీజారెడ్డి గురించి తెలిసిన వారు ఆమెను మ‌ద‌ర్ అన‌కుండా ఉండ‌లేరు. త‌న కుటుంబంలో త‌లెత్తిన స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ఆమె క‌ష్ట‌ప‌డి మార్గం తెలుసుకున్నారు. అయితే, ఆమె అక్క‌డితో ఆగిపోలేదు. అలా ఆగిపోయి ఉంటే.. నేడు ఆమెను మ‌ద‌ర్‌తో పోల్చి ఉండే ప‌రిస్తితి ఉండేదే కాదు. కానీ, త‌న‌లాగా ఈ ప్ర‌పంచంలో అనేక కోట్ల‌మంది త‌ల్లులు ప‌డుతున్న బాధ‌ను ఆమె అర్ధం చేసుకున్నారు. ఆ త‌ల్లులు కూడా త‌న‌లాగే క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ఆ క‌న్నీటికి కొంతైనా తుడిచే ప్ర‌యత్నం చేయాల‌ని సంక‌ల్పించారు.



ఈ క్ర‌మంలోనే అనేక వ్య‌య ప్ర‌యాస‌లకు ఓర్చి.. శ్రీజారెడ్డి స‌రిప‌ల్లి వేసిన అడుగు నేడు ఈ రాష్ట్రం, ఈ దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న త‌ల్లుల మోముల్లో చిరు ఆశ‌లు చిగురింపజేస్తోంది. మ‌రి ఆమె చేసింది ఏంటో తెలుసుకుందాం. కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంప‌తులు ఐటీ రంగంలో ప్ర‌పంచ ఖ్యాతి తెచ్చుకున్నారు. అయితే, ఆ కుటుంబంలో వీరికి జ‌న్మించిన చిన్నారి పుట్టుక‌తోనే స‌మ‌స్య‌ను మోసుకొచ్చాడు. అది కూడా ప‌రిష్కారం లేని(అప్ప‌టికి) స‌మ‌స్య‌తో అల్లాడిపోయేవాడు. అదే ఆటిజం (బుద్ధిమాంద్యం). ఇది మాన‌సిక స‌మ‌స్య‌. పుట్టుక‌తోనే చిన్నారుల‌ను ఆవ‌రించి వారి జీవితాల‌ను చిన్నాభిన్నం చేసే వ్యాధి. దీంతో తల్ల‌డిల్లిపోయిన ఆ దంపతులు త‌మ చిన్నారిని అనేక మంది వైద్యుల‌కు చూపించారు.




అయినా వారికి స‌రైన ప‌రిష్కారం ల‌భించ‌లేదు. పైగా వ్య‌యంతో కూడిన వ్య‌వ‌హారం. దీంతో వారి దృష్టి ఈ స‌మ‌స్య‌తో అల్లాడుతున్న వారిపైకి మ‌ళ్లింది. మ‌నం ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాం.. మ‌న‌లాగా కొన్ని కోట్ల మంది ఉన్నారు. కాబ‌ట్టి దీనికి ప‌రిష్కారం చూపించాల‌ని న‌డుం బిగించారు. ఈ క్రమంలోనే ఆటిజంపై తీవ్ర‌స్తాయిలో అధ్య‌య‌నం చేశారు. ఈ క్ర‌మంలో మూడేళ్లు క‌ష్టించారు. దాదాపు నాలుగు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. ఆటిజంతో బాధ‌పడుతున్న చిన్నారుల ప‌రిస్థితిని అధ్య‌య‌నం చేశారు. వారికి వివిధ రూపాల్లో చికిత్స అందించ‌డం ద్వారా వారి జీవితాల్లో వెలుగు దివ్వెలు వెలిగించ‌వ‌చ్చ‌ని భావించారు.




ఒక త‌ల్లిగా ఈ విష‌యంలో శ్రీజారెడ్డి అంకిత భావంతో వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలో ఆటిజంను అరిక‌ట్టేం దుకు ఫిజియో థెర‌పీ స‌హా సైకాల‌జీలోని అనేక విధానాల‌పై ఆమె ప‌ట్టు సాధించారు. త‌మ కుమారుడితో పాటు ఈ స‌మస్య‌ను ఎదుర్కొంటున్న అనేక మంది చిన్నారుల‌కు వైద్యం అందించే ఉద్దేశంతో హైద‌రాబాద్‌లోని సుచిత్ర‌లో పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసి ఆక్యుపేష‌న‌ల్ థెర‌పీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌, ఎర్లీ ఇంట‌ర్ వెన్ష‌న్‌, ప్లే అండ్ స్ట‌డీ గ్రూప్స్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెర‌పీల‌ను ఏర్పాటు చేసి.. అన్ని ర‌కాల వైద్యాల‌ను ఒకేచోట అందించేందుకు కృషి చేశారు. దీంతో ఆటిజంతో ఇబ్బంది ప‌డుతున్న చిన్నారుల‌కు ఓ దారి క‌నిపించిన‌ట్ట‌యింది.



ప్ర‌స్తుతం 14 కేంద్రాల్లో ఆటిజం చిన్నారుల‌కు వివిధ రూపాల్లో చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల రోజు వారీ ప్ర‌వ‌ర్త‌న‌ను అధ్య‌య‌నం చేస్తూ.. మూడు మాసాల నుంచి రెండేళ్ల వ‌ర‌కు ఈ చికిత్స‌ను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితి లెక్క‌ల ప్ర‌కారం మ‌న దేశంలో దాదాపు కోటి మంది చిన్నారులు ఆటిజంతో బాధ‌ప‌డుతున్న విష‌యాన్ని తెలుసుకుని.. వారందికీ కూడా నూత‌న జివితాన్ని ప్ర‌సాదించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఈ సంస్థ సేవ‌ల‌ను ఏపీ, తెలంగాణ స‌హా త‌మిళ‌నాడు, బెంగళూరు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, అస్సాం, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల చిన్నారుల‌కు కూడా చేరువ చేశారు. అదే స‌మ‌యంలో శ్రీజారెడ్డి సేవ‌ల‌ను అమెరికా, కువైట్‌, ఖ‌తార్‌, లండ‌న్ వాసులు కూడా పొందుతున్నారు. ఇలా చిన్నారుల‌స‌మ‌స్య‌ల‌కు త‌న‌దైన రీతిలో ప‌రిష్కారం చూపుతున్న శ్రీజారెడ్డి మ‌ద‌ర్ అనే ప‌దానికి స‌రైన నిర్వ‌చ‌నంగా నిలుస్తున్నారు.










మరింత సమాచారం తెలుసుకోండి: