అయోధ్యలో రామ‌మందిర నిర్మాం కోసం కీల‌క అడుగులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయోధ్య‌లో రామ‌జ‌న్మ‌భూమి ఆల‌య నిర్మాణం కోసం శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసి, కోశాధికారిగా గోవింద్‌ దేవ్‌ గిరీజీ మహరాజ్‌ను నియమించింది. ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తికావడానికి మూడు నుంచి మూడున్నరేండ్ల సమయం పడుతుందని తెలిపారు. అయితే, తాజాగా ఈ విష‌యంలో మ‌రో కీల‌క పరిణామం సంభ‌వించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తైన సందర్భంగా శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అయోధ్యకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

 


శ్రీరాముడి ఆశీర్వాదం తీసుకునేందుకు అయోధ్య‌కు వచ్చానని ఠాక్రే వెల్ల‌డించారు. ``మేమే అసలైన హిందూవాదులం. బీజేపీ హిందుత్వాన్ని ఎప్పుడో విడిచిపెట్టింది. మేము బీజేపీకే దూరమయ్యాం కానీ.. హిందుత్వానికి కాదు. గత ఏడాదిన్నరలో నేను ఇక్కడికి రావడం ఇది మూడోసారి. నేను ఈ రోజు ప్రార్థనలు కూడా చేస్తాను. `` అని ప్ర‌క‌టించారు. త్వరలో అయోధ్యలో అద్భుతమైన ఆలయం నిర్మాణం అవుతుందని ఠాక్రే విశ్వాసం వ్య‌క్తం చేశారు. ``రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకుండా, రామ మందిరం నిర్మాణం కోసం నా ట్రస్టు నుంచి కోటి రూపాయలను విరాళంగా ఇస్తాను`` అని ఆయ‌న ప్ర‌క‌టించారు.


కాగా, జైపూర్‌లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరీజీ మహరాజ్ మీడియాతో మాట్లాడుతూ  ‘అక్షర్‌ ధామ్‌ నిర్మాణానికి మూడేండ్లు పట్టింది. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహాన్ని మూడేండ్లలో నిర్మించారు. ఇదేవిధంగా మూడు నుంచి మూడున్నరేండ్ల సమయంలో గొప్ప రామ మందిరాన్ని  నిర్మిస్తామని భావిస్తున్నాం’ అని తెలిపారు. అయితే, ఆలయ నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయం ఇప్పుడే చెప్పలేమని, నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని ఆలయ నిర్మాణ కమిటీ.. ఆలయ నిర్మాణానికి పట్టే సమయంపై ఇచ్చే సూచనలను అనుసరించి ఆ తేదీ ఆధారపడి ఉంటుందన్నారు.

 

 

ఆలయం నిర్మాణం కోసం భక్తులు సమర్పించే విరాళాల్ని స్వీకరిస్తామని ఆయన తెలిపారు.మందిర నిర్మాణం కోసం భక్తులు ఇచ్చే విరాళాల్ని స్వీకరిస్తారా? అన్న ప్రశ్నకు గిరీజీ స్పందిస్తూ.. ‘మందిరం నిర్మాణం కోసం అప్పట్లో ఇటుకలను పంపిన భక్తులు.. ఇప్పుడు అదే మందిరం నిర్మాణం కోసం విరాళాలు పంపొచ్చు’ అని చెప్పారు.ప్రజాధనంతో, ప్రజల సహకారంతో ఆలయం నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ నేప‌థ్యంలో ఠాక్రే ప్ర‌క‌ట‌న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: